తిరుపతి : మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలు ముందుకొస్తారని, పురుషులు వెనక్కి వెళ్తారని చెప్పారు. మనం ఇప్పటి దాక పురుషాధిక్య సమాజాన్ని చూశామని, రానున్న రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. 1983 నుంచి ప్రముఖ గాంధీయే వాది..రాస్ మునిరత్నం తనకు ఎంతో ఆప్తుడని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని చెప్పారు. మహిళా సాధికారత.. స్త్రీ సంక్షేమానికి రాస సంస్థ పెద్దపీట వేసిందని అన్నారు. నిస్వార్థ సంఘ సేవ కార్యక్రమాల్లో మునిరత్నం ముఖ్యులు అని చెప్పారు. దేశవ్యాప్తంగా 18% నిరక్షరాస్యత ఉందని..ఇప్పటికీ లింగ వివక్ష భేదం ఉందని అన్నారు. మహిళలను తక్కువగా చూడడం..స్త్రీ..పురుషుల మధ్య తేడా చూస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత విలువలు, విశ్వాసాలు మహిళా సాధికారతకు పునాదులు వేస్తాయన్నారు. గ్రామాల్లో 50% ఉన్న మహిళలకు ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పారు. మహిళలకు అన్ని రకాలు సమాన హక్కులు రావాలని తెలిపారు. స్వేచ్ఛ, స్వతంత్రంతో పాటు ఆర్థిక సుసంపద కూడా మహిళలకు ముఖ్యమని వివరించారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, అప్పుడే స్త్రీ అన్నింటిలో రాణించగలదని చెప్పారు.
ఆడపిల్లలను చదివించుకోవాలి : ‘భేటీ బచావో..భేటి పడావో.. భేటి బడావ్..ఆడపిల్లలను రక్షించుకో..ఆడపిల్లను చదివించుకో.. ఆడపిల్లలను ముందుకు తీసుకెళ్లడం చాలా అవసరం’ అని పేర్కొన్నారు. మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. త్వరలోనే అది కార్యరూపం దాల్చాలని కోరారు. భారతదేశాన్ని పితృభూమి అని పిలవమని, మాతృభూమి అంటామని అన్నారు. మూర్తికి కూడా తగినటువంటి గౌరవాన్ని, స్థానాన్ని సమాజంలో రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీ చదువుకుంటే..కుటుంబమంతా చదువుకుంటుందని చెప్పారు. అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా రాణించగలరని ప్రగతి పథంలో ముందుకు వెళ్లగలరని అన్నారు. అమ్మాయిలకు చదువుకోనివ్వాలని చెప్పారు. దయచేసి అందరి ఇళ్లల్లో తెలుగే మాట్లాడండి..మమ్మీ, డాడీ అనే ఆంగ్ల పదాలు వాడవద్దని సూచించారు. కన్నతల్లిని..జన్మభూమిని ఏ స్థాయిలో ఉన్నా మరవకూడదని చెప్పారు. మాతృభాషను మరిచిన వాడు మానవుడే కాదని..మన భాషను మనం మాట్లాడాలి.. గురువును మరవకూడదని అన్నారు. మన దేశంలో భాషలకు కొదవలేదని.. .మన భాషను మాట్లాడండి..మన ఇంట్లో, మన గుడిలో ఏమి నేర్చుకున్నామో అదే మాట్లాడాలని సూచించారు. మన భాషను మర్చిపోతే వార్తాపత్రికలు మూతపడతాయని అన్నారు. తెలుగు సినిమాలు మూతపడతాయని.. ప్రేమ బాంధవ్యాలకు అర్థం లేకుండా పోతుందని చెప్పారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృభాష మాట్లాడేవారని, అలాంటిది మనం ఎందుకు మాట్లాడలేమని వెంకయ్య నాయుడు అన్నారు.