వెలగపూడి : శాసన మండలి సభ్యులు కెఎస్.లక్ష్మణరావు ప్రచురించిన బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అనే పుస్తకాన్ని సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ ప్రవేశిక విశిష్టతపై బాలబాలికల్లో అవగాహన కల్పించేందుకు “దళిత బహుజన రిసోర్స్ సెంటర్” ప్రచురించగా దానిని ఎంఎల్ సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తిరిగి ప్రచురించగా దానిని సిఎస్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈసందర్భంగా ఎంఎల్సిని ప్రత్యేకంగా సిఎస్ జవహర్ రెడ్డి అభినందించారు. దీనిలో రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చిన పలు ముఖ్యాంశాలను ఈపుస్తకంలో పొందుపర్చారని తెలిపారు.
ముఖ్యంగా మన రాజ్యాంగ ప్రవేశికలో పౌరులందరికీ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని,ఆలోచనల్లోను, భావప్రకటనల్లోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను, స్థితిగతుల్లోను, ఆవకాశాల్లోను, సమానత్వాన్ని చేకూర్చడానికి, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949,నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ లో త్మీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈరాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నామని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చడం జరిగిందని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈపుస్తకంలో మన జాతీయ గీతం జనగణమన, జాతీయ చిహ్నం, జాతీయ పతాకం, మన జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ పుష్పం వంటివి చిత్రాలతో సహా ఉదహరించి ఈపుస్తకంలో పొందుపర్చారని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎంఎల్ సీ కెఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్ళు పూర్తిచేసుకుని 75వ వసంతం లోకి అడుగుడిన సందర్భంగా బాల బాలికల్లో మన రాజ్యాంగ ప్రవేశిక గొప్ప దనాన్ని తెలియజేసి వారిలో రాజ్యాంగం పట్ల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఈ బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అనే పుస్తకాన్ని రచించి ప్రచురించడం జరిగిందని తెలిపారు. భిన్నత్వానికి నిలయమైన భారతదేశం ఏకత్వంలో కొనసాగడానికి రాజ్యంగం దోహదపడిందని అన్నారు. భారత రాజ్యాంగ లక్ష్యాలను పరిరక్షించు కోవలిసిన బాధ్యత అందరిపైనా ఉందని పిల్లలకు కూడా రాజ్యాంగ లక్ష్యాలు విలువలు తెలియాలనే ఉద్ధేశ్యంతో ఈపస్తకాన్ని “దళిత బహుజన రిసోర్స్ సెంటర్”ప్రచురించగా దానిని ప్రచురించడానికి అనుమతించినందుకు ఆసెంటర్ కు కృతజ్ణతలు తెలిపారు.