గుంటూరు : టీడీపీ-జనసేన పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని, ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి. ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో ప్రకటిస్తే జగన్ అక్కడ ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఆయన సంగతి తేలుస్తాడని భయం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ భయంతోనే తాను పోటీ చేసే స్థానాన్ని పవన్ కల్యాణ్ చివరి వరకు పెండింగ్ లో ఉంచుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శించారు. ఎక్కడ పోటీ చేసినా పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో జనసైనికులు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా టీడీపీ-జనసేన పొత్తును అంగీకరించడంలేదని స్పష్టం చేశారు. ఈ పొత్తు అస్తమించే సూర్యుడు తప్ప, ఉదయించే సూర్యుడు కాదని అన్నారు. పొత్తు వల్ల ఓట్ల బదిలీ జరుగుతుందని భావిస్తున్నారని, 1 ప్లస్ 1 కలిస్తే 2 అవుతుందని అనుకుంటున్నారని, కానీ ఇక్కడ 1 మైనస్ 1 అని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు.