జగన్ కు బీసీలు అండగా నిలబడాలి
రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
బీసీ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎన్ మారేష్ కు ఘన సన్మానం
విజయవాడ : బీసీల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం విజయవాడ గాంధీనగర్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో వేముల బేబీ రాణి సభా అధ్యక్షతన బీసీ కుల సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ మెంబర్ గా నియమించిన డాక్టర్ ఎన్ మారేష్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , షేక్ ఆసిఫ్, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు బీసీ సంఘం నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గడిచిన 58 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయన బీసీల పక్షపాతని, వైయస్ జగన్ కు బీసీలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దక్కని సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్లో దక్కుతున్నాయని సామాన్యులను చట్టసభలకు పంపిస్తున్న ఘనత వైయస్ జగన్ కు దక్కుతుందన్నారు.
బీసీ కమిషన్ మెంబర్ మారేష్ మాట్లాడుతూ తనకు రాజ్యాంగబద్ధమైన కమిషన్ లో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, నవరత్నాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలతో బీసీల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. బీసీ కమిషన్ ఎల్లప్పుడూ బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తూ బీసీ రిజర్వేషన్లు పరిరక్షిస్తూ బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఎటువంటి అన్యాయం జరగకుండా కమిషన్ తన పరిధిలో బీసీలకు న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఆసిఫ్ తిరుపతిరావు, మేయర్ భాగ్యలక్ష్మి, పలువురు మారేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.