అమరావతి : నవజాత శిశువుల్లో పుట్టుక లోపాలను గుర్తించి వాటికి సరైన చికిత్స అందించేందుకు చేస్తున్న కృషిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రశంసలను అందుకుంది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రానికి ఈ ప్రత్యేక ప్రశంసలు లభించాయి. గతేడాది జులై నుండి ఇప్పటి వరకూ మొత్తం 1,22,226 మంది చిన్నారులను పరీక్షించగా వారిలో 298 మందికి పుట్టుక లోపాలను గుర్తించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన శిశు ఆరోగ్య పరిరక్షణా విభాగం మార్చి 1వ తేదీ నుండి నెల రోజుల పాటు పుట్టుక లోపాల నివారణా మాసోత్సవంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పుట్టుక లోపాలతో జన్మించిన చిన్నారులకు అన్ని రకాలుగా అవసరమైన సమ్మిళిత మద్దతును అందచేస్తారు. ఇందులో భాగంగా పుట్టుక లోపాలతో జన్మించిన చిన్నారులకు అవసరమైన వైద్య చికిత్స, వారికి మెరుగైన సంరక్షణ అందచేయటంతో పాటు వివిధ రకాలైన పుట్టుక లోపాల ముందస్తు గుర్తింపు, నివారణ, నిర్వహణ వంటి అంశాలపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రతి నవజాత శిశువులోని పుట్టుక లోపాలను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక విధానాన్ని రూపొందించి అమలు చేస్తోంది. దీనితో పాటు మాత్రుశిశు సంరక్షణ పోర్టల్ ద్వారా ఆరోగ్య కేంద్రాలలోని ప్రసూతి కేంద్రాలను ఆన్లైన్లో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులందరికీ గత అక్టోబర్ నెలలో పుట్టుక లోపాల గుర్తింపుపై సమగ్ర శిక్షణనిచ్చింది. దీనితో పాటు పుట్టుక లోపాలను గుర్తించిన శిశువులను రాష్ట్రంలో వున్న 34 డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ కేంద్రాలకు రిఫర్ చేయాలని నిర్దేశించింది. పెదవుల చీలిక, అంగిలి చీలిక, నెలలు నిండని పుట్టుకతో వచ్చిన రెటినోపతి, కలిసిపోయిన కాలి వేళ్లు, చెముడు, కాటరాక్ట్, నరాల బలహీనత, రక్త లోపాలు, చర్మ సమస్యల వంటి పుట్టుక లోపాలను ఆరోగ్య కేంద్రాల ద్వారా గుర్తించి సరైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. పుట్టుక లోపాలకు వైద్య చికిత్స అందించి వారి పునరావాసం కల్పించేందుకు రాష్ట్రంలోని 34 డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ సెంటర్లలో వైద్యాధికారులు క్రుషి చేస్తున్నారు. దీనితో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని ఆస్పత్రులలో కూడా పుట్టుక లోపాలను గుర్తించి ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నారు.