విజయనగరం : ఏపీ రాజకీయల్లో ఒక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం విజయనగరం. తొలి నుంచి రాజ వంశీకులకు రాజకీయంగా కంచుకోటగా నిలిచింది. అలాంటి కోట పైన కొలగట్ల వీరభద్రస్వామి విజయకేతనం ఎగుర వేసారు. విజయనగరం నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఏడు సార్లు విజయం సాధించారు. అలాంటి నియోజకవర్గంలో 2004 లో స్వతంత్ర అభ్యర్దిగా కొలగట్ల వీరభ్రదస్వామి స్వతంత్ర అభ్యర్దిగా తొలిసారి విజయం సాధించి తన సత్తా చాటారు.
నాలుగు దశాబ్దాల అనుభవం : కోలగట్ల వీరభద్రస్వామి 1983లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డెరైక్టర్‌గా, 1987లో విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్‌గా, 1988లో అర్బన్ బ్యాంకు అధ్యక్షునిగా పని చేశాడు. కోలగట్ల వీరభద్రస్వామి1989, 1994,1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. కోలగట్ల వీరభద్రస్వామి 2004లో మాత్రం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరుగులేని నేతగా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు పై గెలిచి వార్తల్లో నిలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలతో పాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
రాజకీయంగా గుర్తింపు : జగన్ కు దగ్గరయ్యారు. వీరభద్రస్వామిపైన నమ్మకంతో 2014లోనే వైసీపీ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గంలోనే ప్రజల మధ్యనే ఉన్నారు. 2015 లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో తిరిగి అసెంబ్లీకి పోటీ చేసారు. అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి పైన 6,400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసారు. జిల్లా నేతలతో సత్సంబంధాలు..నిత్యం ప్రజల మధ్యనే ఉండే నేతగా వీరభద్ర స్వామికి గుర్తింపు ఉంది. ఫలితంగా వీరభద్ర స్వామికి సీఎం జగన్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు. పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న నేతగా జగన్ వద్ద వీరభద్ర స్వామికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
భారీ మెజార్టీ లక్ష్యంగా : ఇక వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు వీరభద్రస్వామి ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. టీడీపీ నుంచి మరోసారి అదితి పోటీ చేయనున్నారు. గత అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం నియోజకవర్గంలో దాదాపు 90 శాతం మందికి అందింది. ఇప్పటికే వీరభద్రస్వామి ప్రతీ ఇంటికి వెళ్లారు. ప్రతీ గడపకు అందుతున్న సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ప్రతీ ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు ఇప్పుడు వీరభద్ర స్వామికి కలిసొచ్చే అంశం. నాలుగు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు, పట్టు సాధించిన వీరభద్ర స్వామి వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూనే భారీ మెజార్టీ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీంతో, విజయనగరంలో ఎన్నికల ఫలితం పైన ఆసక్తి కొనసాగుతోంది.