ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వి. శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు
విజయవాడ : రాష్ట్ర జేఏసీలోని 108 సంఘాల నాయకత్వాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో సేవలందిస్తున్న కార్మికుల ఆర్థిక, ఆర్థికేతర, సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తామని ఏపీ ఎన్జీజీవో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వి. శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు అన్నారు. రాష్ట్ర సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కో ఆప్షన్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎన్జీవో సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా తమకు ఇచ్చిన హామీలన్నిటిని ప్రభుత్వం నుంచి రాబట్టడమే తమ మొదటి కార్యక్రమంగా పేర్కొన్నారు. మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదవీకాలంలో తనకు అండదండగా నిలిచిన జేఏసీ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు సహాధ్యక్షులుగా వి. దస్తగిరి రెడ్డి(కర్నూలు)ఉపాధ్యక్షులుగా బి. వెంకటేశ్వర్లు(నెల్లూరు) పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వందల సంఖ్యలో నాయకులు తరలివచ్చి పుష్ప మాలలతో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, కార్యదర్శి ఎండి ఇక్బాల్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, కోశాధికారి రంగారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జగదీష్, క్యాపిటల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నాగభూషణం, సూర్యనారాయణ రెడ్డి,నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వార్డు,సచివాలయాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు జానీ బాషా, ఎన్ఎంయు అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు తదితరులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి జేఏసీలో కలిసి పనిచేస్తున్న వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.