దేవరపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఉందని, ఇక అంతకు మించిన అవార్డులు, రివార్డులు ఏం అవసరముందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. వాలంటీర్లకు అవార్డులు, రివార్డులు అనేవి వారి ప్రతిభ, పనితీరు ఆధారంగా వస్తాయన్నారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని.. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు. గురువారం దేవరపల్లి మండలం దేవరపల్లిలో ఎంపిడిఓ కార్యాలయం ఆవరణ లో నిర్వహించిన ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం మండలస్థాయి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 310 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేసి పేరు పేరున పలకరించారు. గ్రామాల వారీగా అందరి వాలంటీర్లకు సన్మానం చేసి గ్రూప్ ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణయుగం నెలకొల్పారని తెలిపారు. అవార్డు లు వచ్చినా, రాకపోయినా వాలంటీర్లు అందరూ సేవా వజ్రాలే అని అన్నారు. దేవరపల్లి-2 సచివాలయానికి చెందిన కొమ్మర రాధ, త్యాజంపూడి సచివాలయానికి చెందిన మారుమూడి చంద్రకళ లకు సేవా వజ్ర అవార్డులు రావడం పై హోంమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు, నాయకులకు కంటే వాలంటీర్లు ఎక్కువ ఇష్టం అని తెలిపారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందించడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా మూడవ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రధానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలన్నారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో, గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను అందించడం జరుగుతోందన్నారు. వాలంటీర్లు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలని హోంమంత్రి సూచించారు. గత ప్రభుత్వంలోని సంక్షేమం, అభివృద్ధి, అందించిన సేవలకు.. జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సేవలకు మధ్య తేడాలను ప్రజలకు వివరించాలని కోరారు.
గత ప్రభుత్వంలో బడ్జెట్, ఈ ప్రభుత్వంలో బడ్జెట్ సమానమే అయినా జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎందుకు అందించలేక పోయారని హోంమంత్రి ప్రశ్నించారు. అవార్డుల ప్రదానోత్సవం లో భాగంగా సేవా వజ్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 30 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 20 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. సేవా మిత్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 15 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను హోంమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, నాయకులు, గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.