జగన్ హయాంలో మూడు రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు
కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు గ్రాఫిక్స్ గారడీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి
విజయవాడ : జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి 2019 నుండి 2023 వరకు 1 లక్ష 3వేల కోట్ల వాస్తవ పెట్టుబడులు వచ్చినట్లు రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. గత చంద్రబాబు హయాంలో 2014 నుండి 2018 వరకు రాష్ట్రానికి కేవలం రూ.32800 కోట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు పెట్టుబడుల విషయంలో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారని అన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించిన గణాంకాలతో చంద్రబాబు బురిడీ మాటలు బట్టబయలయ్యాయని అన్నారు. రెండేళ్ల కరోనా కష్టకాలాన్ని సైతం అదిగమించి జగన్ సర్కార్ భారీ పెట్టుబడులు ఆకర్షించిందన్నారు. జగన్ ప్రభుత్వం 2022 లో రూ. 45,217 కోట్లు పెట్టుబడులు తెచ్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
ఆరోగ్య భీమా పై జీఎస్టీ తగ్గించాలి : 144 కోట్లకు పైగా ఉన్న భారతదేశ జనాభాలో కేవలం 40 శాతం మంది మాత్రమే ఆరోగ్య భీమా కలిగి ఉన్నారని, ఆరోగ్య భీమా పై విధించిన జీఎస్టీ 5 శాతానికి తగ్గిస్తే, బీమా పొందే వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే ఆరోగ్య భీమాపై 18 శాతం జీఎస్టీ విధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఈ దశాబ్దం చివరికి పేదరికం లేని భారత్ లక్ష్యం కావాలి : దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ దశాబ్దం చివరికల్లా పేదరికం లేని భారత్ లక్ష్యం కావాలని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా దేశంలో ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండాలన్నారు. ప్రజల ఆదాయం పెంచే చర్యలు చేపట్టడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ దిశగా సత్ఫలితాలు సాధిస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.