కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవాలపై రూపొందించిన కర పత్రాన్ని సిరిసిల్లలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మత్తులు చేసి ప్రాజెక్ట్ ను పునరుద్దరణ చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీని బదనామ్ చేసే కుట్ర పన్నుతోందన్నారు..
ప్రపంచం లోనే నంబర్ వన్ ప్రాజెక్ట్ గా పేరు గాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్ధంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను మంట గలుపుతోందని విమర్శించారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టి గొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిజా నిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన “చలో కాళేశ్వరం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
మంథని బీఆరెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాస్తవాలను వివరిస్తూ రూపొందించిన ఈ కర పత్రాన్ని చదివితే పూర్తిగా అవగత మవుతుందని తెలిపారు.
పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పి కొట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవ రెడ్డి, సిరిసిల్లా జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు శెంకేషి రవీందర్, టౌన్ ప్రెసిడెంట్ కాపురవేన భాస్కర్, కాట అనిల్ తదితరులు ఉన్నారు..