ఎడ్యూ టెక్ కంపెనీ గువీ భాగస్వామ్యంలో ఉచిత ఆన్లైన్ కోర్సులు
ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ అందుబాటులోకి
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ : ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో టెక్ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కృషిచేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం హోటల్ ఫార్చ్యూన్ మురళి పార్కు కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఎస్డీసీ, గువీ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్-ఎ-థాన్ మై ఏపీఎస్ఎస్డీసీ మై వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అదే విధంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ (ఐఐహెచ్ఎంఆర్)తో ఏపీఎస్ఎస్డీసీ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎడ్యూ టెక్ కంపెనీ గువీ భాగస్వామ్యంతో ఏపీఎస్ఎస్డీసీ టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉండటం విశేషమని తెలిపారు. ఈ ఉచిత ఆన్లైన్ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. మొదటి అడుగుగా వెబ్సైట్ డిజైన్ కోర్సును అందించడం జరుగుతుందని.. నైపుణ్యాలు పెంపొందించుకొని కాంపిటీషన్లో కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా అదనపు నైపుణ్యాలను కెరీర్ పరంగా మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు.
ఏపీఎస్ఎస్డీసీ ఐఐహెచ్ఎంఆర్-బెంగళూరుతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. దీంతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించనున్నట్లు తెలిపారు. స్పెషలైజ్డ్ కోర్సుల ద్వారా నర్సింగ్ నైపుణ్యాలు పెంపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ కోర్సులు పూర్తిచేయడం వల్ల క్రెడిట్స్ కూడా లభిస్తాయని సురేష్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్సీహెచ్ఈ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డా. వినోద్ కుమార్, సీజీఎం (టెక్నికల్) డా. రవి కె.గుజ్జల, గువీ సీవోవో అనిత, గువీ సహ వ్యవస్థాపకులు ఎస్పీ బాల మురుగన్, ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సి.నాగరాణి, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ డా. బి.నవ్య, ఎన్ఏసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కె.దినేష్ కుమార్, గువీ ప్రతినిధుల బృందం తదితరులు పాల్గొన్నారు.