విజయవాడ : టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య విచారం వ్యక్తం చేశారు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై తన అభిప్రాయాలతో కూడిన లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని హరిరామజోగయ్య విమర్శించారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని నిర్మొహమాటంగా చెప్పారు. “జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి. ఆ పార్టీ పరిస్థితి అంత దయనీయంగా ఉందా? జనసేన శక్తిని పవన్ కల్యాణ్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. 24 సీట్ల కేటాయింపు జనసేనను సంతృప్తి పరచలేదు. వాళ్లు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారు. పవన్ ను రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలనేది వాళ్ల కోరిక. పార్టీ శ్రేణులను సంతృప్తిపరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరని హరిరామజోగయ్య తన లేఖలో పేర్కొన్నారు.