రాష్ట్రస్థాయి రవాణా శాఖ సాంకేతిక అధికారుల సంఘం అధ్యక్షుడు టి.దుర్గాప్రసాద్ రెడ్డి
విజయవాడ : రవాణా శాఖలో అత్యంత కీలకమైన సాంకేతిక అధికారుల సంఘం ఎన్నికలు బెంజ్ సర్కిల్ సమీపంలో ఒక హోటల్లో ఆదివారం జరిగాయి. ఎన్నికల అధికారిగా ఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్ వ్యవహరించారు. రాష్ట్ర సంఘానికి నూతన కార్యవర్గంలో 27 పదవులకు 26 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఒక్క ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రం ఎన్నిక జరిగింది. ఈ పోటీలో 56 ఓట్ల ఆధిక్యతతో ఆర్. ప్రవీణ్ కార్యనిర్వహక కార్యదర్శిగా గెలుపొందగా, అధ్యక్షులుగా టి. దుర్గాప్రసాద్ రెడ్డి, సహాధ్యక్షులుగా వై. పూర్ణచంద్రరావు, వై. ప్రసాద్, టీవీఎన్ సుబ్బారావు, జి. సత్యం నాయుడు, ఉపాధ్యక్షులుగా జి. తిమ్మరుసు నాయుడు, జి. భాస్కరరావు, జి. నాగ మురళి, ఆర్. సుధీర్ కార్యనిర్వాహక కార్యదర్శితో సహా ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, కోశాధికారిగా సిహెచ్ రాంబాబు సహా ఇతర కార్యవర్గ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఏపీ జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు, కార్యదర్శి కె.వి. శివారెడ్డి ఎన్జీవో సంఘం రాష్ట్ర కోశాధికారి రంగారావు తో పాటు సంఘంలోని వివిధ జేఏసీల నాయకులు అభినందించారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పట్ల వేగంగా స్పందించాలన్నారు. నూతనంగా పదవులు పొందిన నాయకులు మరింత బాధ్యతాయుతంగా పదవులు నిర్వహించి కార్యవర్గానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు. పరిశీలకులుగా ఆర్. శ్రీనివాసులు, సహాయ ఎన్నికల అధికారిగా పి. రాజశేఖర్ వ్యవహరించారు. ఈ కార్యవర్గం ఎన్నికైన నాటి నుంచి మూడేళ్ల పాటు పదవీ బాధ్యతల్లో కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రవాణా శాఖ సాంకేతిక విభాగం అధికారులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.