పరీక్షకు 83.31 శాతం హాజరు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాలో 54 కేంద్రాల్లో 24,373 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయగా 20,304 (83.31 శాతం) మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన కోఆర్డినేటింగ్, కస్టోడియన్, రూట్, లైజనింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల సందర్శన : ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగ్గా జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆదివారం విజయవాడలోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీబీ సిద్దార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, బిషప్ అజరయ్య జూనియర్ కాలేజీ, నలంద డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు.