జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
అసెంబ్లీ లో కులగణన తీర్మానం చేయడం పై హర్షం
కుల గణనపై మేధోమథన సదస్సులో ప్రభుత్వానికి కీలక సూచనలు
అమరావతి : కుల గణనలో ప్రజలు గరిష్ట స్థాయిలో పాల్గొనడం, సమగ్ర డేటా సెట్‌ను సృష్టించడానికి విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సర్వే పూర్తి చేయడానికి తగినంత సమయం కేటాయించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సామాజిక ఆర్థిక కుల సర్వేపై కాచిగూడ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుల సర్వేపై కార్యచరణ, విధివిధానాల ఖరారుపై మేధావులు, న్యాయవాదులు, మరియు రాష్ట్రస్థాయి బీసీ దళ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ అసెంబ్లీ లో కులగణన తీర్మానం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణన పద్ధతులు, ప్రక్రియలు, విధానాలపై చర్చించి, నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సామాజిక నిర్మాణాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి కుల-ఆధారిత గణన అవసరమని, అలాగే సంక్షేమం లక్ష్యంగా ప్రభావవంతమైన విధానాలను రూపొందించడానికి ఈ సమాచారం చాలా ముఖ్యమైనది దుండ్ర కుమార స్వామి తెలిపారు. ఈ ప్రక్రియ చుట్టూ ఉన్న చట్టపరమైన నిర్మాణం బలంగా ఉండాలని, తద్వారా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందని వివరించారు. కుల గణన వ్యక్తి గోప్యతా హక్కులను కాపాడే విధంగా ఉండి సంక్షిప్త ఫలితాలను కేవలం సామాజిక సంక్షేమం కోసం ఉపయోగించాలని, బాధ్యతాయుతంగా వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక టెక్నాలజీ మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లు మరియు ట్యాబ్ ద్వారా డేటా సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయాలని అన్నారు. ఈ సదస్సులో తీసుకొన్న సలహాలు, మేధావుల, న్యాయవాదుల, సూచనలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కుల గణన నిర్వహించాలని దుండ్ర కుమార స్వామి తెలిపారు. అలాగే తెలంగాణ లో ఉన్న ప్రజలందరూ ఈ సర్వేకి అందుబాటులో ఉండి, బీసీల అభివృద్దికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం కన్వీనర్ సత్యనారాయణ, జాతీయ బీసీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్ర బాబు, న్యాయవాది సాయి దినేష్, బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు.