రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు : బ్రిటిష్ వారితో పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం రాయలసీమ ప్రాంత ప్రజలందరూ మొత్తం గర్వపడే విషయమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,శాసనసభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,శాసనసభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయం పరిధిలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఏర్పాటుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి పూర్తి చేసిందన్నారు. భారతదేశంలోనే బ్రిటిష్ వారితో పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతం ముందే కరువు ప్రాంతం అయినప్పటికీ రైతుల నుండి అధిక పన్ను వసూలు చేస్తున్న బ్రిటిష్ వారితో ఇది అన్యాయమని చెప్పి కొన్ని సంవత్సరాలు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి రైతులే ఒక సైన్యం గా ఏర్పాటై బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధమై బ్రిటిష్ వారి ఖజానాను కూడా దాడి చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కర్నూలు విమానశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
స్వాతంత్రం కోసం పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర దేశమంతటా తెలియాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఎంతో గొప్ప ఆలోచన చేసి కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు అని తెలిసేలా విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కొరకు చట్టసభలో ఆమోదించిన ప్రతిపాదనలను ఇప్పటికే భారత ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపడం జరిగిందన్నారు. అదే విధంగా ఎయిర్ పోర్టులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి నీతిపారుదల ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయుటకు సహకరించారని, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ 11 వేల క్యూసెక్ లు వచ్చే వాటిని 44 వేల క్యూసెక్ లకు పెంచడం జరిగిందన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్, జి ఎన్ ఎస్ ఎస్ కెనాల్ లను కూడ పూర్తి చేసేలా కృషి చేసిన వ్యక్తి జ్ఞాపకార్థంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, పార్క్, మెయింటెనెన్స్ గ్రీన్ కో ప్రాజెక్ట్ వారు చేస్తున్నారన్నారు. గ్రీన్ కో వారు ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారని, ఒకపక్క సౌర విద్యుత్తు, మరోపక్క వాయు విద్యుత్తు వాటితో పాటు నీటితో విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, గ్రీన్ కో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, గ్రీన్ కో డెప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ శ్రీనివాస నాయుడు, ఓర్వకల్లు జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, ఓర్వకల్ ఎంపీపీ తిప్పన్న, తదితరులు పాల్గొన్నారు.