రూ.3 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వెంకటాపురంలో రూ.1.25 కోట్లతో శివాలయ పునర్మిర్మాణానికి భూమి పూజ
రూ.8 కోట్లతో నిర్మించిన వెంకటనాయునిపల్లి నుంచి ఆవులదొడ్డి వరకు రోడ్డు ప్రారంభోత్సవం
నంద్యాల జిల్లా డోన్ : అబ్బిరెడ్డిపల్లి-వెంకటాపురం చెరువు వద్ద రూ.3 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామలు సహా డోన్ ప్రజలు పర్యాటక కేంద్రాన్ని ఆస్వాదించేలా అత్యాధునిక సదుపాయాలు తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. వెంగలాంపల్లి చెరువు, వెంకటాపురం- అబ్బిరెడ్డిపల్లి చెరువుల వద్ద బోటింగ్ సౌకర్యాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయన్నారు. రెస్టారెంట్ లు, సూర్యోదయాస్తమయాలను చూసే అవకాశం కల్పించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు మంత్రి వివరించారు. భౌగోళిక పరిధులను బట్టి అబ్బిరెడ్డిపల్లి చెరువు పేరుతో పర్యాటక కేంద్రానికి శిలాఫలకం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వెంకటాపురం గ్రామస్థులు తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని రెండు ఊళ్ల పేరుతో నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి బుగ్గన ఆదేశాలిచ్చారు.
డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో పురాతన శివాలయ స్థానంలో కొత్త గుడిని నిర్మించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. రూ.1.25 కోట్లతో ఆలయ పున:వైభవంలో భాగంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం ఆలయానికి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ నిర్వహించారు. ఆలయ చరిత్ర చెక్కు చెదరకుండా నిర్మాణం చేపట్టేందుకు తీర్చిదిద్దిన నమూనాను ఆయన పరిశీలించారు. అనంతరం గుడి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. డోన్ మండలంలోని ఆవులదొడ్డి గ్రామంలో రూ.8కోట్లతో నిర్మించిన రహదారిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. వెంకటనాయుని పల్లి నుంచి ఆవులదొడ్డి వరకూ 11 కి.మీ దూరం నిర్మించిన రహదారి వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సురక్షితంగా, సులభంగా తమ గమ్యాలను చేరడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.