గుంటూరు : మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విద్య మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను(ఎయిమ్స్) సోమవారం మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని విభాగాల్లోనూ మంత్రి కలియతిరిగారు. వైద్య పరికరాలను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ అధికారులు, సిబ్బందితో కాన్ఫరెన్సు హాలులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి (కొవిడ్ మేనేజ్ మెంట్ & వ్యాక్సినేషన్ ) జిఎస్ నవీన్‌కుమార్, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ , ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి , డీన్ డాక్టర్ జోయ్ ఘోషల్ తదితరులున్నారు. తనిఖీ సమయంలోనూ, మీడియా సమావేశంలోనూ మంత్రి మాట్లాడారు.
ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామన్నారు. అతి త్వరలోనే ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పేద ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే ఎంవోయూలు కుదుర్చుకోబోతోందని తెలిపారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్తమ శిక్షణ లభిస్తుందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ గా ఎయిమ్స్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, అందుకు జగనన్న ప్రభుత్వం కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తుందన్నారు.