ఏపీలో సర్వేల ఫీవర్ మొదలైంది. పలు సంస్థలు ప్రకటిస్తున్న సర్వే ఫలితాలు పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.సర్వే ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే సర్వేలు నిజమేనా..? ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారా అన్నది ప్రశ్నగా మారింది.ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. 2024 ఎన్నికలు మరో రెండు నెలల్లో జరుగుతాయన్న తరుణంలో నేషనల్ మీడియా చేస్తున్న సర్వేలు ఉత్కంఠ రేపుతున్నాయి.అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఏపీలో నిర్వహించాల్సి రావడంతో అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది.జాతీయ పత్రికలైన టైమ్స్ నౌ, ఇండియా టుడే విడుదల చేసిన సర్వే రిపోర్ట్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి, ఇండియా టుడే సర్వేలో టీడీపీకి ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.
టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని వెల్లడైంది. ఏపీలో 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. వైసీపీ 19 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వేలో తేలింది. సామాజిక వర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులతో పాటు పలు కేటగిరీలకు చెందిన వారి నుంచి టైమ్స్ నౌ సంస్థ అభిప్రాయాలను సేకరించింది. మరోవైపు.. టౌమ్స్ నౌ సంస్థ నిర్వహించిన సర్వేలో టీడీపీ – జనసేన కూటమి ఎలాంటి ప్రభావం చూపదని తేలింది. కేవలం లోక్ సభ ఎన్నికల్లో 6 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని వెల్లడైంది. ఇక.. ముఖ్యమంత్రి జగన్ పాలన తీరుపై 38 శాతం మంది అత్య అద్భుతంగా ఉందని.. మరో 26 శాతం మంది ప్రజలు జగన్ పాలన భాగుందని ప్రశంసించారు. మొత్తంగా 64 శాతం మంది ప్రజలు వైసీపీ సర్కార్ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేల్చింది
ఇక.. ఇండియా టు డే సర్వే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టు డే సర్వే చేసింది. టీడీపీ ఏకంగా 17 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. అధికార వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది.
వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే తన సర్వేలో తెల్చింది.
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.ఢిల్లీలో పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు.టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే షర్మిల చదువుతున్నారని 15 రోజుల్లోనే ప్రజా సమస్యలపై ఏం అవగాహన వస్తుందని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో సర్వే ఫలితాలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. రెండు జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో భిన్నమైన ఫలితాలు వెలువడటంతో నేతలు తలపట్టుకుంటున్నారు.ప్రజలు ఎటు డిసైడ్ అయ్యారన్నది ప్రశ్నగా మారింది. టైమ్స్ నౌ సంస్థ గత నెలలో విడుదల చేసిన సర్వేలో 25కు 24 లోక్ సభ స్థానాలు అధికార వైసీపీకి వస్తాయని తెలిపింది. వరుసగా వస్తున్న సర్వే ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండటంతో న్యూట్రల్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ముందస్తు సర్వేల కన్నా ఎగ్జిట్ పోల్స్ ను మాత్రమే తాము నమ్ముతామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియా టుడే సర్వే ఫలితాలు మాత్రం తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతున్నాయి.