కావలి : నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.