స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు
విజయవాడ : రాష్ట్రంలోని మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల జీవన భద్రత, మెరుగైన ఉపాధి కల్పనే ధ్యేయంగా, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ, పట్టణ గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పధకం (నమస్తే) లో ప్రతి ఒక్కరూ నమోదు కావాలని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పురపాలక సంఘాల పరిధిలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్నీ పురపాలక సంఘాల పరిధిలో ఉన్న మలమురుగు, సెప్టిక్ టాంక్ శుభ్రపరిచే కార్మికుల గుర్తింపు పక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. ఇందుకు గాను మల,మురుగు శుభ్రపరచు కార్మికులు, సెప్టిక్ టాంక్ డ్రైవర్లు, హెల్పర్లుతో పాటు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిమగ్నమై ఉన్నవారు తమ పరిధిలోని పురపాలక సంఘంలో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పధకం ద్వారా వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే “నమస్తే” సమన్వయకర్తలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నేతృత్వంలో మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల జీవన భద్రత, మెరుగైన ఉపాధికి కార్యచరణ సిద్ధం చేశారు. ఈ పధకం ద్వారా మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు ప్రభుత్వం నుండి ప్రత్యేక సదుపాయాలు అందుతాయని చంద్రుడు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పధకం ద్వారా రెట్టింపు వైద్య సహాయం అందించటం జరుగుతుందని, పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా ఉన్నత, మెరుగైన విద్య అందించటం సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్ఎస్ కె ఎఫ్ డిసి ద్వారా జీవనోపాధికి గణనీయంగా రుణాలు అందించటం, గరిష్ట రాయితీతో సెప్టిక్ టాంక్ డి-స్లాడ్జింగ్ వాహనాలను సమకూర్చటం జరుగుతుందన్నారు. భద్రత, జీవనోపాధి కొరకు శిక్షణ ఇవ్వటం వంటి లక్ష్యాలను సైతం కలిగి ఉన్నామని చంద్రుడు పేర్కొన్నారు. అర్హులైన వారు మొబైల్ యాప్ లింక్ ద్వారా కూడా నమోదు కాచ్చన్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ అధికారులుగా గంధం చంద్రుడుతో పాటు ఎస్.సి కార్పొరేషన్ విసి, ఎండి ఎస్.చిన్న రాముడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.