వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్
ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం
అయిదుగురికి వీటిని ప్రకటించిన కేంద్రం
17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ
132లో తెలుగువారు ఎనిమిది మంది
తెలంగాణ నుంచి అయిదుగురికి పద్మశ్రీలు
హరికథకురాలు ఉమామహేశ్వరికి పద్మశ్రీ
ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. వీరితోపాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యంలనూ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేసింది. బిహార్‌కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్‌కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందురోజు పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. కళ, సామాజికసేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్రసాంకేతికం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపికచేసి గౌరవిస్తోంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించినవారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
30 మంది మహిళలు : ప్రకటించిన 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్‌నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్, ప్రముఖ గాయనీమణి ఉషా ఉధుప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయ్‌కాంత్‌లకు ఇవే పురస్కారాలు ప్రకటించింది.
ఇంతవరకు ఏపీలో 103, తెలంగాణలో 168 మందికి : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు రెండు పద్మవిభూషణ్‌లతో పాటు ఒక పద్మశ్రీ (డి.ఉమామహేశ్వరి) లభించాయి. తెలంగాణకు 5 పద్మశ్రీలు దక్కాయి. ఇందులో కళారంగం నుంచి ఎ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య; సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యలు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి పద్మవిభూషణ్, 25 మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీలు లభించాయి.
మట్టిలో మాణిక్యాలకు గుర్తింపు : వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనపరుస్తూ పెద్దగా ప్రచారానికి నోచుకోనివారిని కూడా గుర్తించి ‘పద్మశ్రీ’ ప్రదానం చేసే ఆనవాయితీని కేంద్రం కొనసాగించింది. మొత్తం 110 మందిని ఈసారి వీటికి ఎంపిక చేసింది. వీరిలో అస్సాంకు చెందిన పార్వతి బారువా (67) ఒకరు. దేశంలో ఏనుగుల మావటిగా ఉన్న తొలి మహిళ ఆమె. పురుషాధిక్యం ఉండే రంగంలో అడుగిడి తనదైన ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. అడవి ఏనుగులను పట్టుకోవడంలో మూడు రాష్ట్రాలకు చేయూత అందించారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా సాధారణ జీవితం గడపడానికే మొగ్గుచూపారు. 650 రకాల వరి వంగడాలను భద్రపరిచిన సత్యనారాయణ బెలెరి, మొక్కలు నాటి పెంచడానికే జీవితాన్ని అంకితం చేసిన దుఖు మాఝీ, నామమాత్ర రుసుముతో వైద్యసేవలు అందిస్తున్న హేమ్‌చంద్ మాంఝీ, మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజన రైతు సర్బేశ్వర్ బాసుమతరి, 105 ఏళ్ల గోపీనాథ్ స్వెయిన్ తదితరులు దీనిలో ఉన్నారు.