ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 4.08 కోట్లు
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు
అమరావతి : రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్ జెండర్ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు.
ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల : అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు, ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం : రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు.
వారికి ఇంటివద్దే ఓటు హక్కు : 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.