ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవల్లో భారీ వృద్ధి
రూ.25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం
సేవల కోసం చేసిన ఖర్చు రూ.2,489.78 కోట్లు
9,12,370 మందికి రాష్ట్ర ప్రభుత్వం 12,66,365 చికిత్సలు
గుంటూరు : అనారోగ్యం బారినపడి వైద్యం చేయించుకునే స్థోమతలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. చేతి చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టే పనిలేకుండా ఆపత్కాలంలో ఆపద్బాంధవిలా ఆదుకుంటోంది. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లను గణనీయంగా పెంచడం, నెట్వర్క్ ఆస్పత్రులను విస్తరించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా సేవల్లో భారీ వృద్ధి నమోదవుతోంది.
రోజుకు సగటున 5,563 ప్రీయాథ్స్ : 2018–19లో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి రోగుల చికిత్స నిమిత్తం ఆమోదం కోసం రోజుకు సగటున 1,547 అభ్యర్థనలు వస్తుండేవి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి సీఎం జగన్ తీసుకొచ్చారు. దీంతో టీడీపీ హయాంలో 1,059గా ఉన్న ప్రొసీజర్లు.. ప్రస్తుతం 3,257కు పెరిగాయి. అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం బారినపడినా కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం పేదలకు ఉచిత వైద్యసేవలు లభిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రోజుకు సగటున 5,563 అభ్యర్థనలను వస్తున్నాయి. ఇలా ట్రస్ట్‌కు వచ్చిన అభ్యర్థనలకు ఆమోదం తెలపడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య 9,12,370 మందికి రాష్ట్ర ప్రభుత్వం 12,66,365 చికిత్సలను ఉచితంగా చేసింది. ఇందుకు సంబంధించి సర్కారు రూ.2,489.78 కోట్లు వెచ్చించింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ఏడాది నవంబరు నెలాఖరు వరకూ 37.40 లక్షల మందికి 53.02 లక్షల చికిత్సలను ఉచితంగా అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.11,859.96 కోట్లను ఖర్చుచేసింది. టీడీపీ ప్రభుత్వంలో 2014–19 మధ్య అరకొర ప్రొసీజర్లతో కేవలం 22.32 లక్షల చికిత్సలను మాత్రమే అందించారు.
రికార్డు స్థాయిలో నిధుల ఖర్చు : పెరిగిన సేవలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ సర్కారు రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. సీఎం జగన్ ప్రభుత్వం మాత్రం 2019 నుంచి గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చుచేసింది. దీనికి అదనంగా చికిత్సానంతరం రోగులకు భరోసానిస్తూ ఆరోగ్య ఆసరా నిమిత్తం రూ.1,309 కోట్లు వెచ్చించింది. ఇలా నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,165.96 కోట్లు ఖర్చుచేసింది.
రూ.25 లక్షలకు పెంపు : ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి వైద్యసేవల ఖర్చును ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, బీఆర్ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని, బీజేపీ రూ.10 లక్షల వరకూ అంటూ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద సీఎం జగన్ ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కేన్సర్ బాధితులకు సైతం రూ.25 లక్షలు ఖర్చయినా ఆ భారాన్ని మొత్తంగా భరిస్తోంది.