సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ అంగన్వాడీలు
అమరావతి : ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ నెల 24న ఏపీ బంద్‌కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యథావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వాటిపట్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో పదింటిని నెరవేర్చుందుకు అంగీకరించామన్నారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జూన్‌లో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని మంత్రి పేర్కొన్నారు.