భారీ ఎల్ ఈ డి స్క్రీన్ పై అయోధ్య శ్రీ రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రసారం
హాజరైన పశ్చిమ నియోజక వర్గ ఎంఎల్ఏ వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : జై శ్రీరామ్ నినాదాలతో బెజవాడ మారు మోగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభ ఘడియలు ప్రజలకు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేసిన కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఈ డీ స్క్రీన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామ మందిరం విగ్రహ ప్రాణ ప్ర్రతిష్ట సందర్భంగా సోమవారం ఉదయం 5 గంటల నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వ్యాపారుల యజమానుల ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్ లో భారీ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, పశ్చిమ నియోజక వర్గ ఎంఎల్ఏ వెలంపల్లి శ్రీనివాసరావు, బీజేపీ విజయవాడ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రామ భక్తులు పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అలాగే స్క్రీన్ వద్ద పంచ హారతులు ఇచ్చారు.
అనంతరం నిర్వాహకులు స్వామి వారి ప్రసాదాన్ని, పానకం, వడపప్పు పంపిణీ చేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్ సెంటర్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన స్క్రీన్ పై అయోధ్య శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట ప్రసారాన్ని వేలాది మంది భక్తులు తిలకించి, పులకించారు. ఆ ప్రాంతంలో అంతా రామమయంగా జై శ్రీరామ్…జై శ్రీరామ్ జపంతో మార్మోగింది. ఈ స్క్రీన్ ఏర్పాటు చేసిన నిర్వాహకుల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్కర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.