విజయవాడ : కేంద్ర ప్రాజెక్టులోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డాడని, బాబు బినామీ సంస్థ టెరాసాఫ్ట్ కు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ప్రాజెక్ట్ అప్పగించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. నాసిరకం పనులతో నిధులు దోపిడీ చేశారని చివరకు సీఐడీ దర్యాప్తులో బాబు ముఠా అవినీతి బట్టబయలయ్యిందని విజయసాయి రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మరు : 2004 & 2009లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏపీ కీలక పాత్ర పోషించిందని అయితే ఏపీ అవసరాలు తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని గుర్తుచేశారు.ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహరించిన తీరు నుంచి ఏపీ ప్రజలు పెద్ద గుణపాఠం నేర్చుకున్నారని, రాష్ట్ర ప్రజలు పామునైనా నమ్ముతారేమో గానీ కాంగ్రెస్ ను మాత్రం నమ్మరని అన్నారు.
79 లక్షల మందికి ఆసరా పంపిణీ : రాష్ట్రంలో మంగళవారం నాలుగో విడత ఆసరా పంపిణీ చేయనుండడంతో పొదుపు మహిళల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన ఏర్పడిందని అన్నారు, పాడి పశువులు, కిరాణ, వస్త్ర దుకాణాలతో స్వయం ఉపాధిలో మహిళలు దూసుకుపోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పేద మహిళల ఆత్మగౌరవం మరింత పెరిగిందని అలాగే ఆర్థిక వ్యవస్థకూ ఊతం లభించిందని అన్నారు. రాష్ట్రంలో 79 లక్షల మంది మహిళల జీవితాల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, గత 56 నెలల్లో రూ.1,54,929.92 కోట్ల రుణాలు అందించారని, ఈ రుణాలపై వడ్డీ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన పేదరికం : తాజా మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్లో ఆశాజనకమైన అభివృద్దిని సూచించిందని, రాష్ట్ర జనాభాలో కేవలం 6 % మంది మాత్రమే పేదరికంలో ఉన్నారని నివేదిక వెల్లడించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో లబ్దిదారులకు ఆహార పంపిణీ, గృహనిర్మాణం, డీబీటీ ద్వారా నగదు బదిలీ జరగడం పేదరిక నిర్మూలనకు బాటుల వేశాయని అన్నారు. అయితే తదుపరి సర్వే నాటికి రాష్ట్రంలో పేదరికం 1% మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు విజయసాయి రెడ్డి తెలిపారు.