రోజుకి మూడు సభల నిర్వహణకు ప్రణాళిక
కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది
2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీల సభ్యులతో
పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి : 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మనమంతా కలిసి పని చేయాలి. నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు మొదలవుతాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతోపాటు, దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా, అయ్యేలా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఈ సభలు, సమావేశాలను విజయవంతం చేసే బాధ్యత జోనల్ కమిటీలు తీసుకోవాలి. మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే విజయం మనదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐదు జోనులుగా విభజించాం. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జోన్ 1, రాయలసీమ జోన్ 2 ఇలా ఐదు భాగాలుగా విభజించి ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు వేశాం. అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించాలి. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వి ప్రతి రోజు మూడేసి చొప్పున సభలు ఉంటాయి. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించాం. ఈ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అంకిత భావంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఇష్టపడి చేస్తే పనిలో కష్టం తెలియదు : గతంలో మాదిరి కాకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే నిబంధనలు అనేకం ఉంటాయి. అనేక ప్రభుత్వ శాఖల నుంచి ముందు నుంచే అనుమతులు తీసుకోవాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. వాటన్నింటిని తట్టుకోవాలి. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. అదే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు ఆయన బాధితులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయాలి. చేసే పని కాస్త కష్టమే అయినా అధినేతను మనం ఎలా చూడాలనుకుంటున్నామో దాని కోసం మరో రెండు నెలలు మనందరం ఇష్టపడి పనిచేయాలన్నారు.
ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది : పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్ధంగా పని చేసిన ప్రతి జన సైనికుడు, వీర మహిళలను పార్టీ గుర్తిస్తుంది. పార్టీ స్థాపించినప్పుడు నుంచి అంకితభావంతో పని చేసే నాయకులు చాలా మంది పార్టీలో ఉన్నారు. కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉపయోగించుకున్నారు. మరికొంత మంది కొన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది. గత నాలుగున్నరేళ్లుగా అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజలకు మరింత చేరువయ్యాం. ఈ ప్రయాణంలో లక్షలాది మంది భాగస్వాములయ్యారు. నిస్వార్ధంగా పని చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించడం జరుగుతుందని, వారందరినీ ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్, డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా. బొడ్డేపల్లి రఘు, వైస్ ఛైర్మన్ డాక్టర్ పి.గౌతమ్ రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.