ఈ నెల 20, 21 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న షర్మిల
20న ఇడుపులపాయలో బస చేయనున్న షర్మిల
21న విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ
విజయవాడ : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో పీసీసీ చీఫ్ గా నియమించింది. రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.