బోదరహిత జిల్లాలుగా శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు * ప్రకటించిన కేంద్రం * లెప్రసీ నివారణలో తూర్పుగోదావరి ఫస్ట్ * ఆయా జిల్లాల అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రత్యేక అభినందనలు
అమరావతి : ఫైలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందే బోదకాలు వ్యాధి నిర్మూలనలో రాష్ట్రం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వంటి ఐదు అవిభక్త జిల్లాలను కేంద్రం బోద రహిత జిల్లాలుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం బోదవ్యాధి తీవ్రతను తగ్గించటానికి 2002 నుండి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోంది. దేశం నుండి వ్యాధిని పూర్తిగా పారద్రోలేందుకు ఎన్విబిడిసిపి (నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని కృతనిశ్చయంతో అమలు చేస్తోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వంటి పది జిల్లాలో ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలి వుండేది. ఈ వ్యాధి బాన్స్టీ అనే సూక్ష్మక్రిమితో సోకుతుందని క్యూలెక్స్ క్విన్కేఫాసియాటస్ అనే క్రిమివాహక దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధిని నిర్మూలిచేందుకు 2004 సంవత్సరంలో కేంద్రం రెండు ప్రత్యేకమైన పద్ధతులను ప్రవేశపెట్టింది.
సంవత్సర కాలంలో దేశ ప్రజలందరికీ వారి వయస్సులను ఆధారంగా ఒక్క రోజు ఆహారం తీసుకున్న తరువాత డిఇసి మందును, అల్బెండజోల్ మందుతో కలిపి ప్రతి ఒక్కరికీ మింగించాలని సూచించింది.
మందులు వాడే విధానం : రెండేళ్లలోపు వయస్సు వారికి ఎటువంటి మాత్రలూ అవసరం లేదు. రెండు నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు 100 ఎంజి డిఇసి మాత్ర ఒకటి, అల్బెండజోల్ 400 ఎంజి మాత్ర ఒకటి వంతున వినియోగించాలి. అలాగే 6 నుండి 14 ఏళ్ల మధ్య వయస్కులకు డిఇసి 200 ఎంజి మాత్రలు 2, అల్బెండజోల్ 400 ఎంజి మాత్ర 1 ఉపయోగించాలి. 15 ఏళ్ల పైబడిన వారికి 300 ఎంజి డిఇసి మాత్రలు 3, 400 ఎంజి అల్బెండజోల్ మాత్ర ఒకటి వాడాలి. గృహ వైద్యంలో భాగంగా వ్యాధి తీవ్రత వలన కలిగే శాశ్వత అంగవైకల్యాన్ని నియంత్రించేందుకు వరిబీజం శస్త్రచికిత్స, మరికొన్ని ప్రత్యేక గృహ వైద్య పద్ధతులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో వ్యాధి ప్రబలిన 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాలను 2004 నుండి 2013 వరకూ వరుసగా పదేళ్లపాటు నిరాఘాటంగా అమలు చేసి ఐదు జిల్లాల్లో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలిగింది.
లెప్రసీ నివారణలో తూర్పుగోదావరి ఫస్ట్ : అదే విధంగా కుష్టు వ్యాధి వ్యాప్తి నివారణలో రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ముందువరుసలో నిలిచింది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుష్టు నిర్మూలనా కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయటం ద్వారా గత మూడేళ్లలో కొత్త కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలియచేశారు. ముందుగా క్షేత్ర స్థాయిలో ఆరోగ్యసిబ్బంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లద్వారా వివిధ సర్వేలు నిర్వహించి ఇంటింటి కుటుంబ సభ్యులను గుర్తించి వారితో చర్చించటం ద్వారా వ్యాధి వ్యాప్తిపై చైతన్యం కలిగించారు.
అనుమానాదస్పద మచ్చలను ముందుగా గుర్తించి తగిన చికిత్స అందించటం ద్వారా అంగవైకల్యం రాకుండా నిరోధించగలిగారు. క్షేత్ర స్థాయిలో ఎవరికైనా స్పర్శలేని అనుమానాస్పద మచ్చలను గుర్తిస్తే, సిబ్బంది వారిని ఆయా ప్రాంతాలలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యాధికారి ద్వారా ఉచిత ఎండిటి మందులు గుర్తించిన రోజు నుండే అందించి సత్వర చికిత్స అందించటం ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించగలిగారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారి, వైద్యాధికారిణి వారి పరిధిలో వున్న సిబ్బంది ఎంపిహెచ్ఎస్, ఎంపిహెబ్బీ, నోడల్ పర్సన్ ద్వారా నిర్వహించిన ప్రతి సెక్టార్ సమావేశంలో ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించటం, అనుమానాలను తొలగించటం వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగారు. ఇంటింటి సర్వేల ద్వారా గుర్తించిన అనుమానిత కుష్టు వ్యాధి గ్రస్తులను జిల్లా స్థాయి న్యూక్లియస్ టీం ద్వారా ప్రతి గుర్తించిన రోగికీ నేరుగా ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా అంగవైకల్యాని నివారించగలిగారు. దీనితో పాటు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా 10వ తేదీన అంగవైకల్య నివారణా కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా వారిలో అవగాహన కలిగి స్వీయ శిక్షణలో రోగులు వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. గ్రేడ్ 1 అంగవైకల్యం వున్న కుష్టు వ్యాధి గ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఫిజియోతెరపీలో శిక్షణ ఇవ్వటం ద్వారా రోగులు ఇంటివద్దే స్వయంగా నివారణా చర్యలు తీసుకుంటూ గ్రేడ్-2 అంగవైకల్యం బారిన పడకుండా చేయగలిగామని అధికారులు వివరించారు. ఈ విజయాలను సాధించిన ఆయా జిల్లాల అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.