గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడలో ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహేబ్ అంబేద్కర్ “సామాజిక న్యాయ మహా శిల్పం” ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్పం సభల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు మేరుగు నాగర్జున, ఆదిమూలపు సురేష్, ఎంపి నందిగం సురేష్, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్, మొండితోక అరుణ్ కుమార్, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు ఆవిష్కరించారు.
అంబేద్కర్ ఆశయాలను జగన్ అమలు చేస్తున్నారు : ఎంపి విజయసాయిరెడ్డి
దళిత,బడుగు, బలహిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న ఆచారాల వ్యవహారాలు ఉన్నటువంటి ఈ దేశంలో గతిని, దిశను మార్చిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అన్నారు. దళిత అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ నిలువెత్తు రూపంగా నిలిచారని ఆయన కోనియాడారు. మీకు నేనున్నాను. మీ హక్కులు కాపాడడానికి, మీ యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టాడానికి నేనున్నాను అంటూ అన్ని సందర్భాలలోను అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు భరోసా నిచ్చారని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని,అలాగే దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆ రోజుల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అస్పృశ్యతా నిర్మూలనకు ఆయన చేసిన కృషిని నేటి సమాజం మరవలేనిదన్నారు..
అంబేద్కర్ ఆశించిన విధంగానే అదికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో
సీఎం వైఎస్ జగన్ గారు ఆయన ఆశయాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆకాశమంత ఉన్నటువంటి ఆ సంస్కారవంతుని విగ్రహాన్ని భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారని తెలిపారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా చరిత్ర పుటల్లో ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని చెప్పారు. ఏ.పి ప్రజలు కోరుకున్న విధంగానే సమతా న్యాయ శిల్పాన్ని ముఖ్యమంత్రి జగన్ 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారని, ఈ విగ్రహాన్ని ఈ నెల 19న ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. అంబేద్కర్ ప్రజల మనిషి. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. దాదాపు ఈ కార్యక్రమానికి ఒక లక్ష ఏబై వేల మందికి తక్కవ కాకుండా హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
దళితులు,బహుజనులు జగన్ వెంటే..మంత్రి మేరుగు నాగర్జున..
గతంలో అంబేద్కర్ ని అవమానాలు చేసిన ప్రభుత్వాలను చూసామని, నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవమానాలు చేసిన ఘటనను చూసామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముళ్ళ పొదల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి తరువాత అది కూడా ఏర్పాటు చేయలేక పోయారని చెప్పారు. ఏ.పిలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబేద్కర్ భావ జాలాన్ని, సిద్ధాంతాలను అమలు చేస్తున్న వ్యక్తి సిఎం జగన్ అని చెప్పారు. ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్, సిద్ధాంతాలను, భావజాలాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వెంట దళితులందరూ నడుస్తారని స్పష్టం చేశారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి : మంత్రి ఆదిమూలపు సురేష్
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన స్వరాజ్ మైదానాన్ని గత పాలకులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అలాగే ఆ స్థలంలో ప్రైవేట్ వారికి ఇచ్చి మాల్ కట్టాలని చూశారని చెప్పారు. ఇదే స్థలంలో సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ఆలోచనలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన చెప్పారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
జగన్ కి రుణపడి ఉంటాం : ఎంపీ నందిగం సురేష్
అంబేద్కర్ ని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు తప్ప, ఆయన ఆశయాలు సిద్ధాంతాలను అమలు చేసిన దాఖలాలు లేవని ఎంపి నందిగం సురేష్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు తక్కువ..చేతలు ఎక్కువ చేసి చూపిస్తున్నారని, విజయవాడ నడిబొట్టున విగ్రహం ఏర్పాటు చేసి వాస్తవ రూపంలోకి తీసుకోచ్చారని తెలిపారు. దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఆయన చెప్పారు.
అభివృద్ధిని ప్రజలకు వివరించాలి : జూపూడి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. దళితులు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.