విజయవాడ : మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీ డబ్ల్యూసి ) ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత 14 నెలలుగా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన గిడుగు., రాష్ట్ర కాంగ్రెస్ పై తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఈ నేపధ్యంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఎన్నికల ముందు తనదైన శైలిలో నూతన కమిటీలను నియమించి పార్టీ బలోపేతానికి క్రుషి చేశారు. పలు కార్యక్రమాలు నిర్వహించి.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గిడుగు రుద్రరాజును సీడ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించడం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూతన పీసీసీ నూతన అధ్యక్షురాలిగా షర్మిల : ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరింత బలోపేతం అవ్వాలని పార్టీ శ్రేణులంతా ఆకాంక్షిస్తున్నారు.
కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు : గిడుగు రుద్రరాజును సీడ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులుగా, వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేశారు. బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్నాధం,ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిలు మేడా సురేష్, ఏసుదాస్, అన్సారి, ఖుర్షీద, విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఎన్ ఎస్ యు ఐ వేముల శ్రీనివాస్, జగన్, గౌస్ బేగ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.