నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
ఫిబ్రవరి రెండో వారాంతంలోగా లోక్ సభ సభ్యత్వానికి, వైకాపా కు రాజీనామా చేయనున్నట్లు నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న అనంతరం మంచి రోజు చూసుకుని తన ఎంపీ పదవికి, వైకాపా కు రాజీనామా చేస్తానని చెప్పారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైకాపాకు ఎప్పుడు నేను రాజీనామా చేస్తానని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలోనే నేను ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలని భావించాను. కానీ కొంతమంది దమ్ముంటే రాజీనామా చేయాలని రెచ్చగొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులను పెట్టారు. నన్ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ 2020లో జూన్ మాసంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ పిటిషన్ ఫైల్ చేసింది. నన్ను అనర్హుడిగా ప్రకటించే విధంగా చూడాలని, నేను కూడా ఈ విషయాన్ని
చాలెంజింగ్ గా తీసుకున్నాను. అయినా ఒక దశలో నన్ను అనర్హుడి గా ప్రకటించడం వీరి చేతకాదని భావించి, రాజీనామా చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది… అప్పుడే పారిపోతున్నాడనే కామెంట్లను చేశారు. అప్పట్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకత్వం గట్టిగానే ప్రయత్నించి ఒక మీటింగును కూడా ఏర్పాటు చేయించారు. ఆ మీటింగ్ కు నన్ను పిలిచి
వివరణ కూడా కోరారు. సంపూర్ణంగా నా వివరణ ఇచ్చాను. పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని వారు ఫిర్యాదు చేస్తే ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించాను. మీటింగ్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశంతో పారిపోయాడని అంటారని, వారికి కావలసినంత సమయం ఇచ్చాను. అయినా వారు ఏమీ చేయలేకపోయారు. ఇంకా ఎన్నాళ్ళని వేచి చూస్తాం. బడ్జెట్ సమావేశాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పనులకు ఎంపీ నిధుల కేటాయింపు తో పాటు, ఇప్పటికే కేటాయించిన నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల్లో నా సొమ్ముతో, నా గ్లామర్ తోనే గెలిచాను. నాపై అనర్హత పిటిషన్ ఫైల్ చేసిన వైకాపా నాయకత్వం, అనర్హుడిగా ప్రకటించేలా చేయడంలో పూర్తిగా విఫలమయింది . అయినా ఇంకా ఈ పార్టీలో కొనసాగడం అనవసరం. త్వరలోనే రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు .
నరసాపురం స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరుతా
తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో జనసేనతో పొత్తు కలిగి ఉన్న బిజెపి కూడా భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు పునరుద్ఘాటించారు. అలా భావించకపోతే రాజకీయంగా బుద్ధిహీనులే అవుతారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరుతానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండవ వారాంతంలోగా వైకాపాకు రాజీనామా చేస్తానని వెల్లడించిన ఆయన ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలియజేశారు.
నాలుగేళ్లుగా నాపై ఎన్నో అక్రమ కేసులు
గత నాలుగేళ్లుగా నాపై ఎన్నో అక్రమ కేసులను నమోదు చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియజేయాలని న్యాయస్థానాన్ని కోరాను. నాపై 16 నుంచి 17 కేసులు ఉన్నట్టు లెక్క చెప్పారు. అన్నింటిలోనూ న్యాయస్థానం వద్ద నుంచి స్టే పొందాను. లేదంటే అప్పీల్ కు వెళ్లడం చేశాను. నాపై రాజ ద్రోహం కేసు నమోదు చేశారు. వీడో రాజు… నేను ద్రోహం చేశాను అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాజ ద్రోహం సెక్షన్ ను ఎత్తివేయడం జరిగింది. మిగిలిన కేసులలో బెయిలు లభించింది. ఎప్పుడు నా సొంత ఊరు కు వద్దామని అనుకున్న, అప్పటికప్పుడు అక్రమ కేసులను పెట్టడం జరుగుతుంది. వైకాపా నాయకులు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఆ ఫిర్యాదులను స్వీకరించి కేసులను నమోదు చేయడం చేస్తున్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో అల్లూరి సీతారామరాజును ఒకేసారి రెండు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టమని కోరినట్లుగా, నాపై ఒకేసారి నాలుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తుంటారని అన్నారు. పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన కథానాయకుడు. ఆయన తన సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు… తగ్గాలో తెలియాలని చెప్పారు. నాపై అక్రమ కేసుల నేపథ్యంలో నేను కూడా సంయమనం పాటించాను. నాదైన సమయం కోసం ఎదురు చూశాను. తగ్గాల్సిన టైంలో తగ్గాను. ఇప్పుడు నెగ్గాల్సిన సమయం వచ్చింది. తగ్గేదే లేదు అని రఘు రామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
నాపై ఉన్న కేసులలో 153A సెక్షన్ కింద నమోదు చేసినవే అధికం
గత నాలుగేళ్లలో నాపై 153A సెక్షన్ కింద నమోదు చేసిన కేసులే అధికమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అన్ని కులాలను, మతాలను నాకంటే అధికంగా గౌరవించేవారు వైకాపాలో ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి నేను కొన్ని కులాలకు వ్యతిరేకినని చిత్రీకరించి కేసులను నమోదు చేశారు. అయినా, ఈ కేసులలో 41 A నోటీసు జారీ చేయడం మినహా, పోలీసులు చేయడానికి ఏమీ లేదు. పోలీసులు కచ్చితంగా రూల్స్ ను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. పోలీసులు కచ్చితంగా నియమ నిబంధనలను పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. అయినా పోలీసులు నియమ నిబంధనలు పాటించాలని కోరాల్సిన దుస్థితి ఈ పనికిమాలిన ప్రభుత్వం వల్ల నాకు వచ్చింది. జస్టిస్ మానవేంద్రరాయ్ చక్కటి ఆర్డర్ ఇచ్చారు. అటువంటి మంచి ఆర్డర్ ఇచ్చిన వారిని ఈ ప్రభుత్వమే పట్టుబట్టి బదిలీ చేయించినట్టు ఉంది. నిబంధనలు పాటించామని పోలీసులను ఆదేశించమని న్యాయస్థానాన్ని కోరితే, కేసులు లేనప్పుడు ఇటువంటి పిటిషన్ ఎంటర్టైన్ చేయడం మంచిది కాదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వ గత చరిత్ర అటువంటిదేనని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. నాపై 16 కేసులను ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఈనెల 13వ తేదీన నా నియోజకవర్గానికి వెళుతున్న నా చుట్టూ మీడియా ప్రతినిధులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల్లో ఉండే ప్రతి నిమిషం సమయంతో సహా వీడియో రికార్డు చేసే విధంగా వ్యక్తిగతంగా నేను కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను . రేపు ఉదయం 10:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో దిగుతాను. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నా నియోజకవర్గ కేంద్రమైన, జిల్లా కేంద్రమైన భీమవరానికి బయలుదేరి వెళ్తాను. మార్గ మధ్యలో నన్ను కలవడానికి వచ్చిన శ్రేయోభిలాషులను , నియోజకవర్గ ప్రజలను కలుస్తూ అభివాదం చేసుకుంటూ వెళ్తాను. ఈ నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గానికి ఎందుకు రాలేకపోయానో ప్రజలకు వివరిస్తాను. నియోజకవర్గానికి రాలేకపోయినప్పటికీ, ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. నా నియోజకవర్గ పర్యటన సందర్భంగా మా పార్టీ నాయకులు కొంతమంది స్థానిక కళాకారులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వారి మనసు రంజింప చేసే విధంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. నిజమైన వ్యక్తులు వచ్చి ప్రశ్నిస్తే, నిజాలనే చెబుతాను. కళాకారులు వచ్చి ప్రశ్నిస్తే కళలను గౌరవించాలి కాబట్టి వారికి తగిన సత్కారం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అయినా ఇప్పుడు వెకిలి వేషాలు వేసే వ్యక్తులకు మంత్రి పదవి లేదు కాబట్టి స్థానిక కళాకారులు సంయమనం పాటిస్తారని భావిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
హవ్వ… రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పడమా?!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం న్యాయ సూత్రాలను గౌరవించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా , దానికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పడం విస్మయాన్ని కలిగించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పిటిషన్ పై అభ్యంతరం తెలియజేయడాన్ని సీనియర్ న్యాయవాది వై వి రవి ప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు. పిటిషన్ పై అభ్యంతరాన్ని చెప్పడం ద్వారానే వారి కుటిల బుద్ధిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. పిటిషన్ పై పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అన్యాయం తప్ప న్యాయం ఏనాడు చేయని రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి న్యాయాన్ని పాటిస్తుందా?, న్యాయాన్ని పాటించమని చెప్పాలా అని అంటారా?, చెబుతారా??, చెప్పినా చెప్పకపోయినా పోలీసులు న్యాయ సూత్రాలను పాటించాలి. న్యాయస్థానం ద్వారా చెప్పించే ప్రయత్నాన్ని చేశాం. ఈ ప్రయత్నంలో సఫలమైన, సఫలం కాకపోయినా శనివారం నాడు నియోజకవర్గానికి వెళ్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.
దేశ చరిత్రలో ఇంతటి దరిద్రమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు మొదలయ్యాక, ప్రజల చేత పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన వ్యక్తి పై రాజ ద్రోహం కేసు పెట్టాలన్న దరిద్రమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 124A సెక్షన్ కింద టెర్రరిస్టులపై, సంఘవిద్రోహకశక్తులపై రాజ ద్రోహం నమోదు చేస్తారు. దేశాన్ని కూల్చాలని భావించే వారిపై ఈ కేసు నమోదు చేస్తారని, ప్రజల చేత ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు 124A సెక్షన్ కింద రాజద్రోహం కేసు ఏ రాష్ట్రంలోనూ నమోదు చేయలేదు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత కూడా రాజ ద్రోహం కేసు పెట్టలేదు. ఈ ఘన కీర్తి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పోలీసు అధికారులు, రాజకీయ సలహాదారులకు ఈ ఐడియా ఎలా వచ్చిందో… వారి బుర్రలను తీసుకొని వెళ్లి మ్యూజియంలో పెట్టాల్సిందేనని అపహాస్యం చేశారు. బ్రిటిష్ చట్టాన్ని అనుసరించి, క్విన్ ఆఫ్ ఇంగ్లాండ్, కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ గా తనకు తానే జగన్మోహన్ రెడ్డి ఊహించుకొని పెట్టిన దిక్కుమాలిన కేసు ఇదన్నారు. తప్పుడు కేసు పెట్టి దారుణంగా హింసించడమే కాకుండా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, హింసించే వీడియోను చూసి ఘోరంగా ఆనందించడం సిగ్గుచేటు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీ ఎన్నికలను మీరు చూసుకోండి. మా ఎన్నికలను మేము చూసుకుంటాం. నిర్ణయం ప్రజలది. ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా?, కూలదోయాలా అన్న అంతిమ నిర్ణయం ప్రజలదేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
వైకాపాకు అభ్యర్థులే దొరకడం లేదు
రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బొత్స తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారేమో తెలియదు. ప్రజాసేవలో డాక్టరేట్ అందుకున్న మంత్రి నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే టికెట్, కొడుకుకి పక్క నియోజకవర్గంలో ఎంపీ టికెట్ కేటాయించారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నలుగురికి టికెట్లు ఖరారు చేసినట్లు తెలిసింది. కడప నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు ఎంపీగా పోటీ చేయనున్నారు. వై వి సుబ్బారెడ్డి కి రాజ్యసభ, ఆయన కొడుకుకి లోక్ సభ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో బాగుపడిన కుటుంబాలనే ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందన్నారు. వైకాపాకు అభ్యర్థులు దొరకక ఆందోళన చెందుతుంటే, మరొకవైపు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి పార్టీలోకి మమ్మల్ని తీసుకుమ్మంటే, మమ్మల్ని తీసుకోమని కోరే వారి సంఖ్య ఎక్కువ. ఎవరికి సీటు ఇవ్వాలో బేరిజు వేసుకోవడంలో వారు తల మునుకలయ్యారు. ఎన్నికల విధుల్లో నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే ఉపాధ్యాయులను కొనసాగించాలని నిర్ణయించింది. దొంగ ఓట్ల విషయం ఎన్నికల కమిషన్ పగడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దీనితో వైకాపా నాయకత్వానికి మింగుడు పడడం లేదు. సొమ్ములు ఇచ్చేవారు దొరికితే అగ్రవర్గాలకు సీటు కేటాయిస్తూ, ఎవరూ దొరకని చోట బీసీలకు సీట్లను ఇస్తూ,తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. బీసీ నేతలైన పార్థసారధి, సంజీవ్ కుమారులు పార్టీని వీడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎవరు టికెట్లు ఇచ్చిన కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులకే ఇవ్వాలి. బొత్స సత్యనారాయణ సతీమణికి టికెట్ ఇచ్చి, తాము బీసీలకు టికెట్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాల వరకే వారు బీసీలు. కేంద్ర ప్రభుత్వ కులాల జాబితాలో వారు బీసీలు కాదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
బీసీల పార్టీ అంటే టిడిపి
టిడిపి అంటే బీసీలు, బీసీలు అంటే టిడిపి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బీసీలకు తామేదో మేలు చేసినట్లుగా వైకాపా ప్రభుత్వం తప్పుడు పబ్లిసిటీని చేసుకుంది. కుర్చీ, బెంచీ తో పాటు రూపాయ నిధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ నిజాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్తాం. ప్రజల్లోకి వెళ్లి ఈ నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాక్షేత్రంలోకి ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లి వివరిస్తాం. వ్యక్తిగత దూషణలు, వ్యక్తుల జీవితాలలోకి తొంగి చూడడ మనేది తమ విధానం కాదన్నా రఘురామ కృష్ణంరాజు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైకాపా ఎత్తుగడ బెడిసి కొట్టిందన్నారు . మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య లు చెప్పినట్లుగా సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాసి, కాపుల మధ్య విభేదాలను సృష్టించాలని చూశారు. అయితే ఇప్పుడు కాపులు సంఘటితమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. వైకాపా నాయకులను ముద్రగడ పద్మనాభం తనయుడు ఛీ కొట్టినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .