గుంటూరు : రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఏపీలో మూడు రైల్వే సర్వీసులు పొడిగించే కార్యక్రమాన్ని ఆయన గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ఏపీకి రైల్వే బడ్జెట్ కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారన్నారు. అత్యాధునిక సాంకేతికతతో తయారైన వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభిస్తే వాటిలో ఏపీ మీదుగా ఐదు వెళ్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వంలో 25,800 కిలోమీటర్ల కొత్త ట్రాక్ వేశారని, అందులో ఏపీలోనే 371 కి.మీ ఉందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్లు విద్యుదీకరణ చేశామని తెలిపారు. కొత్త సర్వీసుల పొడిగింపుతో గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
పొడిగించిన సర్వీసులు ఇవే : విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ (నం.22701/22702) రైలును గుంటూరు వరకు పొడిగించారు. ఈ పొడిగింపుతో గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి విశాఖపట్నానికి రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుంది. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వరకు నడుస్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ (నం.07284/07285) నరసాపురం వరకు పొడిగింపు. దీంతో నరసాపురం, భీమవరం ప్రాంతవాసులకు గుంతకల్, బళ్లారి, హుబ్బళ్లి వరకు నేరుగా రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. విజయవాడలో రైలు మారాల్సిన అవసరం ఉండదు. నంద్యాల-కడప వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించారు. దీంతో నంద్యాల, కడప, చుట్టుపక్కల ప్రాంతవాసులు తిరుమల చేరేందుకు సానుకూలంగా ఉంటుంది. ఈ పొడిగింపు 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.