అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ కాంస్య విగ్రహం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
రూ. 400 కోట్లకు పైగా నిధులు వినియోగించి 18.81 ఎకరాల విస్తీర్ణంలోగల అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ లో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం
ప్రపంచలంలో అతి ఎత్తైన 210 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
400 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల బ్రాంజ్ వినియోగించి విగ్రహం తయారీ
స్మృతివనంకు వన్నె తేవటానికి రాజస్థాన్ పింక్ ఇసుకరాయితో తాపడం
రికార్డు సమయంలో పనులు పూర్తిచేశాం
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ
విజయవాడ : అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ మహోత్సవం సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ వివిధ శాఖల అధికారులతో గురువారం పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ రూ. 400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. స్మృతివనం ప్రాంగణ ఆవరణలో మెరుగులుదిద్దే కార్యక్రమాలు జరుగుతున్నాయని, నాలుగు రోజుల్లో ప్రారంభోత్సవానికి అంబేడ్కర్ స్మృతివనం సిద్దంగా ఉంటుందన్నారు. ఈ నెల 19 న సాయంత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాంస్య విగ్రహంను ప్రారంభిస్తారన్నారు. ముఖ్యమంత్రి ఫెడస్టల్ లో ఏర్పాటు చేసిన లిప్ట్ ద్వారా పైకి చేరి ఆ మహనీయుని పాదల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి లాంఛనంగా విగ్రహాన్ని ప్రారంభిస్తారన్నారు. అలాగే అంబేడ్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటేయిన్, వాటర్ ఫౌంటేయిన్ లు కూడా ప్రారంభిస్తారన్నారని, బహిరంగ సభలో పాల్గొంటారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ తెలిపారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహ విశేషాలు చూస్తే 18.81 ఎకరాల స్థలం మధ్యలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా కింద బేస్ (ఫెడస్టల్) ఎత్తు 85 అడుగులు అని దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ అన్నారు. ప్రపంచంలోనే అంబేడ్కర్ విగ్రహాల్లో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం అని తెలిపారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్ స్టీల్, 120 అడుగుల మెట్రిక్ టన్నుల బ్రాంజ్ వినియోగించామని వివరించారు. అలాగే 2200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి వినియోగించి స్మృతివనం మొత్తం తాపడం చేయటం జరిగిందన్నారు. స్మృతివనం పనులు రికార్డు సమయంలో శరవేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయటంలో అధికారులు, సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం రాష్ట్ర పండగలా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిని స్మృతివనంలో ఏర్పాటు చేసిన డిజిటల్లీ స్రీన్లు పై ప్రదర్శించటం జరుగుతుందన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖాధికారులు పాల్గొన్నారు.