మోడీ మోసానికి కేరాఫ్ అడ్రస్
షర్మిల పాత్రను ఖర్గే నిర్ణయిస్తారు
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్
విజయవాడ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో కలిపి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అనేక చారిత్రక తప్పిదాలకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మండిపడ్డారు. సీఏఏ, రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చేటువంటి వివిధ రకాల నల్ల చట్టాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని మాణిక్కం ఠాగూర్ మండి పడ్డారు. మోదీ అంటేనే మోసానికి కేరాఫ్ అడ్రస్ అంటూ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, మెట్రో, రైల్వే జోన్ వంటివి ఏపీకి ఎన్నో చేస్తానన్న మోడీ అధికారం చేపట్టిన తొమ్మిదిన్నరేళ్లలో ఏమీ చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే విభజన హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయగలదని ఆయన స్పస్టం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లో భాగమన్న ఆయన కాంగ్రెస్ కుటుంబంలో, ఏపీలో ఆమె పాత్రను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని వెల్లడించారు. వైఎస్ఆర్ కల అయిన రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమనే యగ్నంలో తమతో పాటు షర్మిల కూడా భాగం అవుతారని ఆయన పేర్కొన్నారు. 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయని ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆశాభవం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తినిచ్చిందని చెప్పారు. గత రెండు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రస్తుత ఎన్నికలకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ : జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పోస్టర్లు, స్టిక్కర్లు, బ్యాడ్జిలను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో కలిపి మాణిక్కం ఠాగూర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో అందరికీ సమానంగా సామాజిక, ఆర్థిక, న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే 66 రోజుల పాటు 6,700 కిలోమీటర్లు జరిగే రెండో దశ యాత్రను రాహుల్ గాంధీ చేపడుతున్నారని వివరించారు. అదే విధంగా గురువారంనాడు ఒంగోలులో జరిగే యువభేరి కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడ్ల్యుసీ సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.