ఆర్.ఎస్.ఎస్ చెప్పు చేతల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం
పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులను గెంటివేసి కీలక బిల్లులు ఆమోదం
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబీ విమర్శ
అంగన్వాడిల సమస్యలు పరిష్కరించకపోతే వైసిపి పతనం ఖాయం
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హెచ్చరిక
ఏలూరు : మూడు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాముడు పేరుతో కేంద్ర బిజెపి రాజకీయ డ్రామా ఆడుతోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబీ తీవ్రంగా విమర్శించారు. రెండు రోజులపాటు ఏలూరులోని శ్రీ హోటల్ కన్వెన్షన్ హాలులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబీ, బి.వి. రాఘవులు విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడారు.
పార్లమెంట్లో భద్రత కల్పించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధానమంత్రి మోడీగానీ, హోం మంత్రి అమిత్ షా గానీ పార్లమెంట్ భద్రతపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై నిలదీసిన ప్రతిపక్షాలను బయటకు గెంటివేసి కీలక బిల్లులు ఆమోదింప చేసుకుంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది ఏ మాత్రం సరి కాదన్నారు. ప్రతిపక్షాల డిమాండ్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం అప్రజాస్వామికమన్నారు. గుజరాత్ బిజెపి ప్రభుత్వం బల్కిస్ భానో నేరస్తులను ఏకపక్షంగా విడుదల చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టిందన్నారు. ప్రజలు వివిధ మతాలను విశ్వసిస్తారని కొంతమంది అయ్యప్ప ను, మరి కొంతమంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరి కొంతమంది వారికి ఇష్టమైన మత విశ్వాసాలను నమ్ముతారని, ఇది లౌకిక రాజ్యమని అన్నారు. బిజెపి మాత్రం రాముడి నినాదంతో ముందుకు సాగుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తోందని రాజకీయాలలోకి మతాన్ని తీసుకురవడం, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట పేరుతో కేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోందని చెప్పారు. ఎవరైనా ఇల్లు పూర్తి అయిన తర్వాత గృహప్రవేశం చేస్తారని అయితే అందుకు విరుద్ధంగానే రామాలయం పూర్తి కాకుండానే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నరేంద్ర మోడీకి రాముడిపై ఎటువంటి మర్యాద లేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. దేశ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, వారి సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరిక
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా సాగదీస్తే రాజకీయంగా వైసిపి ప్రభుత్వం పతనం ఖాయమని అధికారాన్ని పళ్ళెం లో పెట్టి ప్రతిపక్షాలకు అప్పగించడమేనని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హెచ్చరించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసే చర్యలు చేపడుతూ ముందుకు సాగుతోందన్నారు. అంగన్వాడీల సమ్మె మొదలైన 26 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్మా చట్టం గుర్తు వచ్చిందని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతూ ఎస్మా ప్రయోగించడానికి సిద్ధపడిందని చెప్పారు. తొలుత అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టారని తర్వాత సచివాలయ సిబ్బందితో నడపాలని చూసారని అనంతరం సిడిపిఓ లతో బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేసి అంగన్వాడీలు వెనుకంజ వేయకపోవడంతో ఎస్మా ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. సెలక్షన్ కమిటీల పేరుతో సంజాయిషీ నోటీసులు ఇచ్చి పది రోజులలో సమాధానం చెప్పకపోతే చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి చర్చించే పద్ధతి లేదని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జయలలిత ఎస్మా ప్రయోగించగా తరువాత ఆమె ప్రభుత్వాన్ని జనం సాగనంపారని చెప్పారు. అనుచివేత చర్యలు మంచివి కావని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయం చేస్తున్నారంటూ ప్రభుత్వం చెబుతోందని ఎదురు దాడి చేస్తోందని అయితే రాజకీయాలలో ఇది సహజమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యమాలకు మద్దతు ఇచ్చారని, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆందోళనలకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని, ఇది సహజంగా జరుగుతుందన్నారు. ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంగన్వాడీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని మద్దతు ప్రకటించారని చెప్పారు. రాజకీయపక్షాల సహాయం తీసుకుని తక్షణం సమస్యలు పరిష్కరించాలని, సిపిఎం ని అడిగితే చేతనైన సహాయం చేస్తామన్నారు.నచ్చితే అమలు చేయవచ్చునన్నారు. లేకపోతే ట్రేడ్ యూనియన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే ప్రభుత్వానికే మంచిదని హితవు పలికారు. లేదంటే రాజకీయ పార్టీలుగా ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగుతామని హెచ్చరించారు. కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తూ మీడియా గొంతు నొక్కే చట్టం తెచ్చిందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన చట్ట నిబంధనలు చూస్తే చాలా కఠినంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అమలులోకి వస్తే మీడియాకి స్వతంత్రత ఉండదన్నారు. మీడియాను కూడా ఉగ్రవాద చట్ట పరిధిలోకి తీసుకువచ్చి నియంత్రించే విధంగా కేంద్ర చర్యలు ఉన్నాయని చెప్పారు. న్యూస్ క్లిక్, పలు పోర్టల్ విషయంలో జర్నలిస్టులను వేధిస్తున్నారని దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. వాక్ స్వాతంత్ర్యం లాగానే పత్రికా స్వాతంత్ర్యం ఉండాలన్నారు. వెంటనే నిబంధనలు వెనక్కి తీసుకోవాలని మీడియా సంఘాలతో చర్చించి నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి పాల్గొన్నారు.