జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు
విజయవాడ : రానున్న ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని గెలిపిస్తే భారతదేశంలో ప్రజా రంజకంగా పాలన అందజేస్తామని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు (ప్రభు) చెప్పారు . బుధవారం విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో బ్రష్టు పట్టిపోయాయని విమర్శించారు. ప్రజల సంక్షేమము, దేశాభివృద్ధి లక్ష్యంగా జై మహాభారత్ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుందని వివరించారు. భారతదేశంలోని అన్ని లోక్ సభ స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన వివరించారు. తమ పార్టీ అజెండాను వివరిస్తూ భారతదేశంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని, అర్హులైన మహిళలకు భూలక్ష్మి పథకం ద్వారా 100 చదరపు గజాల భూమిని ఉచితంగా అందజేస్తామని, అలాగే పావలా వడ్డీ చొప్పున లక్ష రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన వివరించారు. అలాగే సబ్సిడీతో గృహలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీతో సోలార్ స్టవ్ లను అందజేస్తామని ,50 రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తయారు చేస్తామని ఆయన వివరించారు. దేశం మొత్తంగా ఉచిత విద్యా విధానాన్ని అమలు చేసి కుల మత జాతి ప్రాంతాలు కతీతంగా విద్యార్థులందరికీ ఉపకార వేతనం అందిస్తామని చెప్పారు. దేశం మొత్తంగా ఉచిత వైద్యం ఉచిత మందులు పంపిణీ విధానాన్ని అమలు చేసి దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని పన్నులను క్రమబద్ధకరించి 16% కామన్ టాక్స్ అమలు చేసి ప్రజల ఆర్థిక ఇబ్బందులు నిర్మూలిస్తామని చెప్పారు. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గ పరిధిలోనే శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. ఇంకా పలు ప్రజోపయోగ కార్యక్రమాలను అవినీతి రహితంగా అందజేస్తామని ఆయన వివరించారు. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే మహిళా సంక్షేమం కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తామని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని వనరులను అవినీతి రహితంగా సమర్థవంతంగా అమలుచేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తామని వివరించారు. భారతదేశంలోనూ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గణనీయమైన మార్పు తెచ్చేందుకు జై మహాభారత్ పార్టీ కృషి చేస్తుందని ఆమె వివరించారు. రానున్న ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని ఆదరించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జై మహాభారత్ పార్టీ జాతీయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అజెండాను నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.