రెండు, మూడు రోజుల్లో బడ్జెట్ విడుదలకు చర్యలు
భూసేకరణ చేసేటప్పుడు జర్నలిస్టుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచన
త్వరితగతిన జర్నలిస్టులకు అనువైన ఇళ్లస్థలాలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు
ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణకు అవసరమైన బడ్జెట్ రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సీసీఎల్ఏ అధికారులు వెల్లడించారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూసేకరణ చేసేటప్పుడు జర్నలిస్టుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్లు వివరించారు. జర్నలిస్టులకు అనువైన ఇళ్లస్థలాలను అందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు కేటాయించే ఇళ్లస్థలాల కోసం 23 నవంబర్, 2023న ప్రారంభమైన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535 జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో గడువు తేదీ 6 జనవరి, 2024 నాటికి జర్నలిస్టుల నుండి 10,017 దరఖాస్తులు అందాయని తెలిపారు. జీవోలోని నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను, జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి 7,651 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను తదుపరి వెరిఫికేషన్ కోసం 26 జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగిందన్నారు. అసంపూర్తిగా ఉన్న 766 మంది జర్నలిస్టుల దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు వారికి మరో అవకాశం కల్పించామని కమిషనర్ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత జర్నలిస్టులకు సందేశాలు పంపడం జరిగిందని వెల్లడించారు. వివరాలు సరిచేసుకున్న అనంతరం సదరు జర్నలిస్టుల దరఖాస్తులను వెరిఫై చేసి కలెక్టర్లకు పంపిస్తామని పేర్కొన్నారు. గడువు తేదీ ముగుస్తున్న నేపథ్యంలో జనవరి 5 ,6 తేదీల్లోనే దాదాపు 1,626 మంది జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోగా, 1600 మంది జర్నలిస్టుల దరఖాస్తులు మాత్రమే ప్రాథమిక ధృవీకరణ కోసం పెండింగ్ లో ఉన్నాయని, వాటి వెరిఫికేషన్ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.