తమ డిమాండ్స్ మేనిఫెస్టోలో పొందుపరిచే పార్టీలకు మాత్రమే మద్దతు
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహ మూర్తి
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అన్ని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ సమావేశంలో పాల్గొన్న ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ విశ్రాంత డైరెక్టర్ , ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహ మూర్తి ప్రసంగిస్తూ ప్రతీ రాజకీయ పార్టీ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 500 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయిస్తామని కేవలం 385 కోట్లు మాత్రమే ఇచ్చి నిరాశపరిచిందన్నారు. 2019 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బ్రాహ్మణులకు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి తెలుగుదేశం గురి కావలసివచ్చిందని గుర్తు చేశారు. అదే ఎన్నికల్లో వైస్సార్సీపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి 4 శాసనసభ సీట్లు కేటాయించగా ఇద్దరు శాసన సభ్యులు గా గెలుపొంది ప్రభుత్వంలో కీలకమైన హోదాలు కూడా పొందారన్నారు. ఆయా నాయకులు వల్ల బ్రాహ్మణ సామాజికవర్గానికి ఏమాత్రం న్యాయం జరగకపోగా అన్ని విద్యలను ప్రోత్సహిస్తున్నామని ప్రగల్భాలు పలికే ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వం వేదవ్యాస స్కీం ని రద్దు చేసి హిందూ సామాజిక వర్గానికి సంభందించిన వేద విద్యార్థుల ఉపకారవేతనాలు తొలగించడంతో ఇటు బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు యావత్తు హిందు సమాజం ఆగ్రహావేశాలతో ఉన్నారని ఉద్ఘాటించారు.
ప్రస్తుత ప్రభుత్వం కంటే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే మేలు అనిపిస్తోందని, అప్పట్లో కనీసం నిరుపేద బ్రాహ్మణులకు ఎంతోకొంత లబ్ది చేకూరిందని, ప్రతీ బ్రాహ్మణ సంఘ నాయకుడు కార్పొరేషన్ కార్యాలయం కి వచ్చి వారి ప్రాంతాల్లో ఉన్న పేద బ్రాహ్మణ్యం కి ఎంతోకొంత సంక్షేమ పథకాలు ఇప్పించేవారని తెలియచేశారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరు శాసనసభ్యులు, నలుగురు ప్రభుత్వ సలహాదారులు అనేకమంది బ్రాహ్మణులు అనేక హోదాలలో ఉన్నా పేద బ్రాహ్మణుడు నోట్లో మట్టి కొట్టేసారని నవరత్నాలవల్ల బ్రాహ్మణులకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా వారు నిర్లక్ష్యంగా ప్రతీ వినతిపత్రం బుట్టదాకులా చేసేసారన్నారు. 2020 నుండి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృతిగా ప్రభుత్వం గుతించాలని మహాధర్నా నిర్వహించినప్పుడు ప్రభుత్వం తరపున తక్షణమే ఇది అమలు చేస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, కులవృత్తులకు రిజర్వేషన్లు లేవని అప్పట్లో ప్రగల్భాలు పలికి బ్రాహ్మణులు ఎడల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ డిమాండ్లను ప్రతీ రాజకీయ పార్టీకి అందించామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ మా డిమాండ్స్ మేనిఫెస్టోలో పొందుపరిస్తే ఆయా పార్టీలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తో పాటు ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ తో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బులుసు శివశంకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.