కాకినాడ డీఈవో కార్యాలయం వద్ద సోకాజ్ నోటీసులు భగ్నం
మరింత ఉధృతంగా సమ్మె పోరాటం : ఉద్యోగుల ప్రతిన
కాకినాడ : సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులను దగ్ధం చేసి కాకినాడ డీఈఓ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐదో తేదీ ఎస్పీడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపిన అధికారులు నేడు నోటీసులు పంపి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ తాటాకు చప్పుళ్ళకు, నోటీసులకు భయపడేది లేదని నినాదాలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ చేయమంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి నోటీసులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. సమగ్ర శిక్షలో 6వేలు జీతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని, పెరిగిన ధరలకు వేతనాలు ఏమాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధికార యాత్రలో జగన్ రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమనికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎం.చంటిబాబు, సత్యనాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి.సాయికిరణ్, ఎ. లోవరాజు, పివివి.మహాలక్ష్మి, ఎం.రాధాకృష్ణ, సహాయ కార్యదర్సులు కె.చంద్రశేఖర్, జి.నారాయణ, ఎంబి.సాల్మన్, జిల్లా కోశాధికారి పి.రాజు, కె.శ్రీనివాస్, ఎం.గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు.