జగమొండి మోడీ మెడల వంచిన ఘనత రైతు సంఘాలదే
రైతాంగ ఉద్యమ ఫలితమే రైతులకు పింఛను
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఎఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు తక్షణం అమలు
కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న మోడీ
బిజెపి, బిజెపి బలపరిచే పార్టీలను ఓడించండి
మాజీ మంత్రి వడ్డే శోభనాదీ శ్వర రావు
రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైన రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
రాజమహేంద్రవరం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. దేనికి తలవంచని జగమెండి మోడీని మెడలు వంచిన ఘనత ఢిల్లీ రైతు ఉద్యమానికి దక్కుతుందన్నారు. అదే స్ఫూర్తితో విద్యుత్ సంస్కరణలు అమలుకు వ్యతిరేకంగా, గిట్టుబాటు ధర కోసం రైతాంగం బలమైన ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలు సోమవారం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. స్థానిక మున్సిపల్ స్టేడియం నుండి ఇస్కాన్ రోడ్డు మీదుగా రివర్ బో ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు రైతు మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రైతు సంఘం మహాసభలు కొల్లి నాగేశ్వరరావు ప్రాంగణం, వై వి కృష్ణారావు, చంద్రప్పన్ వేదిక వద్ద ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభలో ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల్లో ఐక్యత లేదని హేళన చేసిన వారికి బుద్ధి చెప్పే తరహాలో రైతు ఉద్యమం జరిగిందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 450 రైతు సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిందన్నారు. 13 నెలలుగా నిర్విరామంగా నిద్రాహారాలు మాని రైతులు చేసిన పోరాటానికి మోడీ తలవంచక తప్పలేదని అన్నారు. ఈ పోరాటం పై ఐక్యరాజ్యసమితి సుప్రీంకోర్టు స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. నోట్లు రద్దు, జీఎస్టీ, బ్యాంకులో ప్రైవేటీకరణ వంటి వాటిలో వెనక్కు తగ్గని మోడీ రైతు పోరాటంతో క్షమాపణ చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సంస్కరణలను ఆగమేఘాలపై అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని అన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు బిగించడం, విద్యుత్ చార్జీలు పెంచడం, ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకు జగన్ సిద్ధపడ్డాడు అని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా 11 రాష్ట్రాలు తీర్మానం చేయగా చివరకు బిజెపి పాలిత ఉత్తర్ ప్రదేశ్ కూడా వ్యతిరేకించిన అంశాన్ని మోడీ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కలిసి మోడీ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయడం దుర్మార్గం అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాదీ శ్వర రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎమ్మెస్ స్వామినాథన్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తే దానిని నేటికీ అమలు చేయలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మోడీ తుంగలో తొక్కారని అన్నారు. అధికారంలోకి వచ్చాక స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తే మార్కెట్ తల్లకిందులు అయిపోతుందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 13 నెలలుగా రైతులు పోరాడితే మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడని 2024లో మళ్లీ అధికారంలోకి వస్తే తిరిగి ఆ చట్టాలను అమలు చేసే హెచ్చరించారు. పేదల కష్టాన్ని అదాని, అంబానీ లకు దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. మోడీ అధికారంలో ఉన్న 9 సంవత్సరాలలో 14.65 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థల రుణాలు రద్దు చేశారని అన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించడంతోపాటు విదేశాలకు సైతం ఎగుమతులు ప్రపంచ ఆహార భద్రతకు సైతం భరోసా కల్పిస్తున్న రైతాంగాన్ని చులకనగా చూడడం భావ్యం కాదు అన్నారు. 40 శాతం మంది రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే ఎకరాకు పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని చెప్పారు. 35 సంవత్సరాల్లో రైతులు పండించిన పంటలకు ధరలు 22 రెట్లు పెరిగితే సిమెంట్ స్టీల్ వంటివి 90% పెరిగాయని అన్నారు. మోడీ మళ్ళీ అదికరల్ లోకి వస్తె అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చివేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జనవరి 26వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామన్నారు. జనవరి 12వ తేదీ విజయవాడలో రైతు సమస్యలపై పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2024 ఎన్నికలలో బిజెపి, బిజెపికి మద్దతు పలికే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు రైతు సంఘం సీనియర్ నాయకులు కేశవ శెట్టి జెండా ఆవిష్కరించారు. ఎ ఐ కే ఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, గాలి చంద్ర, రాష్ట్ర నాయకులు సంపన్న గౌడ్, మల్లికార్జున్ లక్ష్మీ సుబ్బారావు లు వ్యవహరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్లు సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పంతం నాగేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్, ఈ మహాసభలకు సందేశం ఇవ్వటానికి హాజరైన వివిధ రైతు సంఘాల ప్రముఖులు సింహాద్రి ఝాన్సీ ఎం వెంకటరెడ్డి జి బాలు ముప్పాల సుబ్బారావు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆఫీస్ బేరర్స్ పి జమలయ్య, మల్నేడు ఎలమందారం, కాటమయ్య డేగ ప్రభాకర్. వి హునుమా రెడ్డి, చుండూరు రంగారావు, తదితరులు వేదికను అలంకరించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు గన్ని భాస్కరరావు ప్రసంగించారు నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ బృందం ఆలపించిన రైతు ఉద్యమ గేయాలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి.