రాష్ట్ర చరిత్రలో గతమెరుగని విధంగా పోస్టుల భర్తీ
వైద్యులకు ఏడో వేతన సవరణను అమలు చేసిన ముఖ్యమంత్రి జగనన్న
వైద్యులకు మేలు చేసింది నాడు వైఎస్సార్, నేడు జగనన్న
భారీగా నియామకాల ద్వారా వైద్యులకు పని ఒత్తడి తగ్గించాం
నాడు– నేడుతో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి
జీరో వెకెన్సీ విధానంతో ముందుకు సాగుతున్నాం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిని అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆత్మీయ సమావేశం
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనలో వైద్యులకు ఎన్నలేని గుర్తింపు, గౌరవం దక్కాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చిన ఘనత జగనన్నదే అని చెప్పారు. వైద్యుల వేతనాలను కూడా గణనీయంగా పెంచిన ప్రభుత్వం తమదేని తెలిపారు. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడే విషయంలో వైద్యులు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశధారని, ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోరని పేర్కొన్నారు. వైద్యుల త్యాగానికి, కష్టానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైద్య వృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వైద్యులకు తొలిసారి అత్యంత ప్రాధాన్యత దక్కిందని గుర్తుచేశారు. వైద్యులకు తొలిసారి యూజీసీ పే స్కేల్ అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కీర్తి గడించారని తెలిపారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతులు ఇవ్వడం, వైద్యుల ఆత్మరక్షణ కోసం చట్టాలు తీసుకురావడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు సైతం అమలయ్యేలా చూడటం, ఇలా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల వల్ల వైద్యుల ఆత్మ గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంతకుమించి వైద్యుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నారని వెల్లడించారు.
దేశానికే ఏపీ ఆదర్శం
వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా జీరో వేకెన్సీ విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని తెలిపారు. సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేసి జగనన్న రికార్డు సృష్టించారని వెల్లడించారు. వైద్యుల నియామకాల్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు ఏపీకి వచ్చి వైద్యుల నియమాకాలపై పరిశీలన చేస్తున్నారని వివరించారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి కొత్తగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటుచేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు.
నాడు– నేడు తో అభివృద్ధి
నాడు– నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలను రూ.8,500కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. వాటిల్లో ఐదు కళాశాలలకు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేస్తూ వెళుతున్నామని పేర్కొన్నారు.
వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు
ఆస్పత్రులను బలోపేతం చేయటంతోపాటుగా అసలు వ్యాధులే రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రజని చెప్పారు. అందులో భాగంగా ప్రివెంటీవ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ముందస్తుగానే ఇళ్ల వద్దే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.
జీజీహెచ్ అభివృద్ధికి కృషి
గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు మంత్రి రజని తెలిపారు. జీజీహెచ్ క్యాన్సర్ సెంటర్‌ను గ్రేడ్ వన్ లెవల్‌కు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జీజీహెచ్ క్యాన్సర్ సెంటర్‌కు రూ.20 కోట్ల పెట్‌సీటీ స్కాన్ ఇచ్చామని చెప్పారు. సీటీస్కాన్ పరికరం కొనుగోలుకు రూ. 4 కోట్లు ఇచ్చామని, సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం రూ.7.5 కోట్లు ఇచ్చామని వివరించారు.
వైద్యుల సమస్యపై తక్షణమే స్పందన
ప్రభుత్వ వైద్యుల యూనియన్ నాయకులు, జూనియర్ డాక్టర్స్ యూనియన్ నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. వైద్యుల సమస్యలపై మంత్రి రజని వెంటనే స్పందించి ఎరియర్స్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, టైమ్‌బాండ్ ప్రమోషన్స్ ఇచ్చేందుకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. పీజీ వైద్యులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు విషయంలో మినహాయింపు ఇస్తామని, మహాప్రస్థానం వాహనాలు అదనంగా ఏర్పాటు చేస్తామని, జీజీహెచ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
పేదల హృదయాలు గెలవాలి
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని, పేదలు వాటిని భరించలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైద్యులు తాము చేసే వైద్యసేవలతో దేవుళ్లుగా పూజింపబడతారని, వైద్యసేవలతో పేదల హృదయాలు గెలవాలని సూచించారు.
ప్రతి ఇంటికి వైద్యం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేద వాని ఇంటికే వైద్యం తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందున్నారు. ఏ ప్రభుత్వం ఎన్నడూ ఖర్చుచేయని విధంగా సీఎం జగన్ వైద్య రంగానికి వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రతి పేదకు ఉచితంగా ఆరోగ్యం అందిస్తున్నారని కొనియాడారు.
ఇండియాలోనే అత్యధికంగా వైద్యులున్న రాష్ట్రం ఏపీ
డైరక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సలిజామల వెంకటేశ్వర్ ఐఎఎస్ మాట్లాడుతూ ఇండియాలో అత్యధికంగా స్పెషలిస్ట్ వైద్యులను కలిగిన ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో 61శాతం స్పెషలిస్ట్ వైద్యుల ఖాళీలు ఉంటే ఏపీలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉందన్నారు. ఒక్క ఖాళీ కూడా లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేయటం వల్లే నాణ్యమైన వైద్యసేవలు ఏపీ ప్రజలకు అందుతున్నాయన్నారు. కోవిడ్‌లో ఏపీ వైద్యరంగం చేసిన సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అకడమిక్ డీఎంఈ డాక్టర్ సూర్యశ్రీ, డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీటీకె రెడ్డి, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ బాబు, రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ రమేష్, గుంటూరు అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎస్వి రమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జింకానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్, ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు మంత్రి విడదల రజనిని ఘనంగా సన్మానించారు. జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వ వైద్యులు, వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.