శ్రీకాకుళం : మాజీ క్రికెటర్ అంబటి రాయుడును అధికార పార్టీ ఐదు రోజులకే డకౌట్ చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాయుడు మాత్రమే కాదు ఇంకా చాలా మంది హేమాహేమీలు వైసీపీ నుంచి బయటకు రాబోతున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్యయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరేందుకు చాలామంది సంప్రదిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆందోళన చేయని కార్మికుడే లేడని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికే ఈ బస్సు యాత్ర చేపట్టామని వివరించారు. పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలను, టీడీపీ పరిష్కార మార్గాలను పొందుపరుస్తామని తెలిపారు. కాగా, కార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కలి నుంచి కుప్పం వరకు 26 రోజుల పాటు 92 నియోజకవర్గాలలో సాగుతుందని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ దువ్వూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.