గుంటూరు : చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలిరావాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం జగన్‌ను దూషించడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా?. పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా?. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, పవన్ చేసిందేమీ లేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్తుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు.
బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. చంద్రబాబు, పవన్‌లకు పిచ్చిమాటలు మాట్లాడే అవలక్షణం ఉంది. సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, సచివాలయాలు, స్కూల్స్ కట్టించారు. లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. చంద్రబాబు లేకపోతే రాష్ట్ర ప్రజలు అసలు విమానాలే ఎక్కనట్లు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారు. బిగ్ బజారులో వాటాలు ఉన్న చంద్రబాబు నిత్యావసర వస్తువులను ఎందుకు అధికంగా అమ్ముతున్నారు. ప్రజలను తాగుబోతులను చేసేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
బీసీలకు ఏం చేశావని చంద్రబాబుకు ఓట్లు వేయాలి?. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారా?. చంద్రబాబుకు ఆయన ఇంట్లో, బంధువుల్లోనూ వ్యతిరేకమే. ఎన్టీఆర్ కుటుంబం నుంచి తోడపుట్టిన సోదరులు, అక్క, వారి పిల్లలు అందరూ వ్యతిరేకమే. అలాంటి వ్యక్తి ఎదుటివారి గురించి ఎలా మాట్లాడతారు?. రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోని కాపీ కొట్ఠం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ. 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అప్పట్లో తునిలో మీటింగ్ పెట్టారు. చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను అమలు చేయమనే కాపులు ఉద్యమం చేశారు. మరి ఇప్పటికీ పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?. తనకు కులం లేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు మా పార్టీ వీడుతున్నారు. జగన్‌ని నమ్మిన వారంతా పార్టీలోనే ఉన్నారు. జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. షర్మిళ ఒక రాజకీయ నాయకురాలు. ఆమె ఏపీకి వస్తే మాకేం ఇబ్బంది ఉంటుంది? వైసీపీని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆయన్ను చూసే షర్మిళ అయినా, నేనైనా, ఇంకొందరైనా పార్టీలో చేరాం. కొందరు వదిలేది పోయినంత మాత్రాన ఏం జరుగుతుంది?. జగన్ బొమ్మ లేకుండా కాపు రామచంద్రారెడ్డి గెలవలేరని పేర్ని నాని పేర్కొన్నారు.