అనంతపురంలో ఈ నెల 9న ” అనంత తెలుగు బాషా వైభవ సదస్సు ”
రాష్ట్రంలో తెలుగు బాషా వికాసం కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర సాహితీ సదస్సు నిర్వహిస్తున్నాం
నెల్లూరులో దక్షిణాంధ్ర సాహితీ సదస్సు
తణుకులో గోదావరి సాహితీ వైభవ సదస్సు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, కవిపండితులు, సాహితీమూర్తుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు
విజయవాడ : అనంతపురంలో ఈనెల 9న “అనంత తెలుగు బాషా వైభవ సదస్సు ” నిర్వహిస్తున్నామని ఈ సదస్సులో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన 90 మందిని ఈ సమావేశంలో సత్కరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పి. విజయబాబు మాట్లాడుతూ ‘ అనంత ‘ తెలుగు బాషా వైభవ సదస్సు అదేవిధంగా మున్ముందు ఆంధ్ర ప్రదేశ్ అధికార బాషా సంఘం తరపున తెలుగు బాషా గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింప చేసేందుకు నిర్వహించబోవు కార్యక్రమాల వివరాలను పాత్రికేయులకు వివరించారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలందరూ ఈసదస్సుకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయన విజ్ఞప్తి చేసారు. పాలనావసరాల కోసం, తెలుగు భాషా సంస్కృతుల పరిపుష్టికి బాషా సంఘం పాటు పడుతున్నదన్నారు. తెలుగు భాష, ప్రపంచీకరణ నేపథ్యంలో రేపటి తరం భవిత కోసం ఆంగ్ల భాష అన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భావాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషా వికాసం కోసం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా అయన గుర్తు చేసారు. ఈ క్రమంలో తెలుగు భాషా వికాసం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సాహితీమూర్తులను విస్తృతస్థాయిలో పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి ఆశయాలకు అభిరుచులకు అనుగుణంగా వారిని సగౌరవంగా సత్కరిస్తున్నామని అయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గిడుగు రామ్మూర్తి వారోత్సవాలు, వేమన శత జయంతి ఉత్సవాలు, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, అల్లూరి శత జయంతి వేడుకలు, గుర్రం జాషువా జయంతి ఉత్సవం, శంకరంబాడి సుందరాచార్య జయంతి, పొట్టి శ్రీరాములు జయంతి మరియు తెలుగు ‘గళ’ ప్రతిభా పురస్కారాలు వంటి వివిధ కార్యక్రమాలలో లబ్దప్రతిష్టులైన అనేకమంది సాహితీమూర్తులను, అదేవిధంగా టీవీ, రేడియో ‘స్వర’ మాంత్రికులను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున పురస్కారాలతో ఘనంగా సత్కరించామని అయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేది అనంతపురం జిల్లాలో ‘అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు నిర్వహిస్తూ 90 మందిని ఈ సదస్సులో సత్కరిస్తున్నామని. 10 మంది సాహితీస్రష్టలను తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారాలతోనూ, 40 మందిని తెలుగు భాషా సేవ ప్రతిభా పురస్కారాలతోనూ, మరో 40 మంది కవులు, కళాకారులను కూడా సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాహిత్య వైశిష్ట్యం, జిల్లా భాష, పద్య కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, జానపదం, బళ్ళారి రాఘవ నాటకం, సాహిత్య విమర్శ, సాహిత్యంలో హాస్యం వంటి ప్రత్యేక ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ‘జయహో శ్రీకృష్ణదేవరాయలు’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగానే పూర్వ జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు కలిపి విశాఖపట్నం కేంద్రంగా ‘ఉత్తరాంధ్ర సాహితీ సదస్సు’ నిర్వహించనున్నామన్నారు. పూర్వ జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి నెల్లూరులో ‘దక్షిణాంధ్ర సాహితీ సదస్సు’, తణుకులో ‘గోదావరి సాహితీ వైభవ సదస్సు’, నిర్వహిస్తున్నామన్నారు. ‘ధార్మిక సాహితీ సదస్సు’ కూడా నిర్వహించనున్నామని అయన తెలిపారు.
టీవీ యాంకర్లకు తెలుగు ‘గళ’ ప్రతిభా పురస్కారాలు ఇచ్చిన విధంగానే మీడియా రంగంలో వ్యాస రచయితలకు అంటే తెలుగు భాష మీద మంచి పట్టు ఉన్న ‘ఫీచర్ రైటర్లకు’ కూడా పురస్కారాలు ఇవ్వనున్నామన్నారు.
ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, కవి పండితులు, సాహితీమూర్తుల వివరాల జాబితాను సమగ్రంగా నవీకరిస్తున్నామన్నారు. కనుక వారి పేరు, చిరునామా, చరవాణి, మెయిల్ అడ్రస్, రచనలు తదితర పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుల వారి ఆంతరంగిక కార్యదర్శి బిట్టు రమేష్, చరవాణి. 8801811782, అదనపు అనంతరంగిక కార్యదర్శి వి. రఘు కుమార్ చరవాణి. 79894999978 కు వాట్సప్ ద్వారా లేదా ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం మెయిల్ అడ్రస్ olcommissionap@gmail.com కు పంపవలసిందిగా కోరుతున్నామన్నారు. తెలుగుభాషాభివృద్దికి బాషా వికాసానికి విస్తృత స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. ఈ సమావేశంలో బాషా సంఘం సభ్యులు ఆచార్య రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.