ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలు
బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి ధర్మాన కృష్ణ చైతన్య
నరసన్నపేట : కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించిన వేళ, చంద్రయాన్ – 3
జాబిల్లి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగి చరిత్రను సృష్టించిన క్షణాలు ఎన్నటికీ
మరిచిపోలేనివని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జాబిల్లిపై
చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావడంతో ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ
వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ ప్రయోగం భావితరాలకు ఎంతగానో
స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన ఇస్రో
శాస్త్రవేత్తలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ముందు ముందు మన దేశం మరిన్ని
శక్తివంతమైన ప్రయోగాలకు చిరునామాగా నిలుస్తుందని కృష్ణదాస్ ఆకాంక్షించారు.
ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలు : బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి డాక్టర్
ధర్మాన కృష్ణ చైతన్య
చంద్రయాన్ – 3 విజయవంతానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలు నేడు దేశానికి
నిజమైన హీరోలని బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు.
నరసన్నపేట మేజర్ పంచాయతీ సచివాలయంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, సర్పంచ్ బూరెల్ల
శంకర్, ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి విక్రం లాండర్ సాఫ్ట్ లాండింగ్
ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. శాస్త్ర సాంకేతిక, భౌగోళిక, అంతరిక్ష
రంగాలలో భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
విను వీధిలో భారత కీర్తి పతాకను రెప రెపలాడించిన ప్రతి ఒక్క ఇస్రో
శాస్త్రవేత్తకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారత జాతీయ పతాకాన్ని
చేతబూని జయభారత్ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కోరాడ చంద్రభూషణ్, రాజాపు
అప్పన్న, సురంగి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.