ఉచిత వైద్య శిబిరాలు, స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు అభినందనీయం
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
విజయవాడ : గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ నిస్వార్థ సేవ
చేస్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
విజయవాడ సమీపంలోని ఆత్కూర్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయుష్
హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని విశ్వసిస్తూ వివిధ రంగాలలో ప్రజలకు చేయూతను
అందిస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సూచనలు, స్వయం
ఉపాధికి మార్గదర్శనం ఎంతో అవసరమని, ఈ విషయంలో స్వర్ణభారత్ ట్రస్ట్ చొరవ
చూపిస్తోందన్నారు. చికిత్స కన్నా ముందస్తు నివారణ మేలని, అందుకే గ్రామీణ
ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వారికి ఉచితంగా
ట్రస్టు నిర్వాహకులు మందులు పంపిణీ చేస్తున్నారన్నారు.
జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్న సంగతిని ఆయన గుర్తు చేస్తూ వైద్యులు ఈ
విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భారత్ ను ప్రపంచ తయారీ
కేంద్రంగా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ నిశ్చయమని చెబుతూ ఈ లక్ష్యసాధనకు యువతలో
నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా స్వర్ణ భారత్
ట్రస్ట్ కృషి చేస్తోందని అభినందించారు. వివిధ రంగాల్లో గ్రామీణ ప్రాంత యువతకు
నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ అందిస్తోందని, వారిని ఉద్యోగ, స్వయం ఉపాధి
దిశగా సిద్ధం చేస్తోందని చెప్పారు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న
స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులు ,సిబ్బందిని అభినందించారు. ఉచిత వైద్య
శిబిరంలో 500 మందికి పైగా ప్రజలకు సేవలు అందించారు. ఉచిత వైద్య శిబిరంలో
గుండె, ఎముకలు, కీళ్ళనొప్పులు, ఊపిరితిత్తులు , మెదడు, నరాల సమస్యలకు, సాధారణ
జబ్బులకు ఆయుష్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి తగిన
సలహాలు అందజేశారు.
మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది.. నేత్ర వైద్య పరీక్షలు,
విష్ణు డెంటల్ క్లినిక్ వైద్యులు, సిబ్బంది దంత పరీక్షలు నిర్వహించారు.
అవసరమయిన వారికి ఉచితంగా మందులు అందచేశారు. వైద్యశిబిరంలో సేవా దృక్పథంతో
వైద్యసేవలు అందించారంటూ ఆయుష్ హాస్పిటల్స్, మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్, విష్ణు
డెంటల్ క్లినిక్ వైద్యులకు, వైద్య సిబ్బందికి మాజీ ఉపరాష్ట్రపతి అభినందనలు
తెలిపారు. పరీక్షల కోసం వచ్చిన వారికి, వారి సహాయకులకు ట్రస్టు నిర్వాహకులు
ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఆయన ఏప్రిల్, 2023 పదవ తరగతి పరీక్షా
ఫలితాలలో ప్రతిభ కనబరిచి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన గన్నవరం,
ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాల
విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్
కామినేని శ్రీనివాసరావు, స్వర్ణ భారత్ ట్రస్ట్ డైరెక్టర్ పరదేశి, వైద్యులు,
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.