దొర
తగిన జాగ్రత్తలు వహించాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు
విజయనగరం : కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు పటిష్ట ఏర్పాట్లు
చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అధికారులను ఆదేశించారు.
రాకపోకలు సాగించేందుకు అనువుగా రహదారులను సిద్ధం చేయాలని, ఎత్తుపల్లాలను సరి
చేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించాలని, కార్యక్రమాన్ని విజయవంతం
చేసేందుకు సమష్టి కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న
కుంటినవలస లోని ప్రాంతాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు,
బొబ్బిలి, గజపతినగరం ఎమ్మెల్యేలు చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, గిరిజన
యూనివర్సిటీ వీసీ ప్రొ. కట్టమణి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్, ఎస్పీ దీపిక
ఎం. పాటిల్ తదితరులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి
ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు. శంకుస్థాపన ప్రాంతానికి వెళ్ళే రహదారి విస్తరణ
చేయాలని, వాహనాల పార్కింగ్ స్థలం చదును చేయాలని, ఇతర ఏర్పాట్లు చేయాలని
సూచించారు. పర్యటనలో వారి వెంట ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు,
పంచాయతీరాజ్ శాఖ, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.