పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
సత్యసాయి జిల్లాలో కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శన
కదిరి : చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో కూడా నైపుణ్యాలను సాధించడం
వల్ల జీవితంలో స్వశక్తితో నిలబడగలరని, చదవాలనే తపన ఉండి చదువుకు దూరమైనవారిని
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) అందిస్తున్న
పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేర్పించాలని పాఠశాల విద్యాశాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. శనివారం సత్యసాయి జిల్లా
కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
(నైపుణ్య అభివృద్ధి కేంద్రం) కార్యకలాపాలను, అందిస్తున్న కోర్సుల గురించి
అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సమర్థవంతంగా నైపుణ్య అభివృద్ధి
కార్యక్రమాలు కూడా అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఏపీ ఓపెన్ స్కూల్
సొసైటీ స్టడీ కేంద్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులో ఆరుగురు అభ్యాసకులకు ప్రవేశం
కల్పించారు. వారిలో ముగ్గురిని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో కూడా అడ్మిషన్లు
కల్పించారు. రాష్ట్రంలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న
వారిలో అర్హులైన అభ్యాసకులు ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్
కోర్సుల్లో ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం స్టడీ కేంద్రాలలో చదువుతున్న పదో తరగతి,
ఇంటర్మీడియట్ విద్యార్థులను తప్పనిసరిగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో
చేర్పించాలని కోరారు. దీనికోసం నైపుణ్యాభివృద్ధి, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ
జిల్లా సమన్వయకర్తలు పరస్పరం ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం)
డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు, కడప ఆర్జేడీ ఎం.వి.
కృష్ణారెడ్డి , జిల్లా విద్యాశాఖాధికారిణి యు.మీనాక్షి, సత్యసాయి జిల్లా
స్కిల్ డెవలప్మెంట్, ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్తలు ఆయుబ్, ఎం.లాజర్
తదితరులు పాల్గొన్నారు.